Morbi bridge: మోర్బీ తీగల వంతెన విషాధం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల సంఖ్య 140 దాటేసి.. మరింత పెరుగుతుండటం అత్యంత బాధాకరం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్థానిక ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. మరమ్మత్తుల కారణంగా 7 నెలల తర్వాత ఇటీవలే రీఓపెన్ అవగా.. వారం రోజుల్లోపే ఇంతటి దుర్ఘటన జరగడం కలకలం రేపుతోంది. వందలాది పర్యాటకులు వచ్చే రోప్ బ్రిడ్జి రిపేర్ పనులను.. నిర్మాణ రంగంలో అసలేమాత్రం అనుభవం లేని ఒరెవా కంపెనీకి అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలేంటీ ఒరెవా కంపెనీ?
పురాతన మోర్బీ తీగల వంతెన బాగా దెబ్బతినడంతో ఏడు నెలల క్రితం మూసివేశారు. 2022 మార్చిలో బ్రిడ్జి రిపేర్ కాంట్రాక్టును ఒరెవా కంపెనీ దక్కించుకుంది. 15 ఏళ్ల కాల పరిమితితో.. బ్రిడ్జి మరమ్మత్తులు, నిర్వహణ బాధ్యతలు ఒరెవా కంపెనీకి కట్టబెట్టారు మోర్బీ మున్సిపాలిటీ అధికారులు. అందుకుగానూ, సందర్శకుల నుంచి టికెట్ రూపంలో ఒరెవా గ్రూప్ ఫీజు వసూలు చేసుకుంటుంది.
అయితే, ఒరెవా కంపెనీకి నిర్మాణ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. దేశ ప్రజలకు సుపరిచితమైన అజంతా, ఆర్పాట్ గోడ గడియారాలు తయారు చేసేది ఈ ఒరెవా కంపెనీయే. గడియారాలతో పాటు సీఎఫ్ఎల్ బల్బులు, కాలుక్యులేటర్లు, పలు ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఈ-బైక్స్ ను ఒరెవా గ్రూప్ తయారు చేస్తోంది. ఇలాంటి కంపెనీకి వందేళ్ల పురాతన తీగల బ్రిడ్జి మరమ్మతు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి.
మరమ్మత్తు లోపాలతో పాటు పరిమితికి మించి సందర్శకులను బ్రిడ్జిపైకి పంపించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అంటున్నారు. తీగల వంతెన రిపేరు పనులు పూర్తి అయ్యాక.. ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే ప్రజలను బ్రిడ్జిపైకి అనుమతించారని తెలుస్తోంది. తప్పు ఎవరిదైనా.. వందలాది మంది సామాన్యులు జలసమాధి కావడం మాత్రం దారుణం.