Big Stories

Karnataka : సీఎం పదవి.. సిద్ధరామయ్యకే ఛాన్స్..? డిప్యూటీగా డీకే..?

- Advertisement -

Karnataka News Today(Siddaramaiah vs DK Shivakumar): కర్ణాటక సీఎం పదవి సిద్ధరామయ్యకే దక్కే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కు ఎలాంటి పదవి ఇవ్వాలన్నదానిపై ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని అధికారంలోకి తేవడంలో డీకే కీలకపాత్ర పోషించారు. అయితే ఆయనపై ఉన్న ఈడీ, ఐటీ కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. శివకుమార్ ను సీఎంను చేస్తే కేంద్రం ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోందని సమచారం. అందుకే సిద్ధరామయ్య వైపు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

శివకుమార్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కు అండగా ఉన్న మైనార్టీలు, దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకటికి మించి డిప్యూటీ సీఎంలు ఉంటే ఆ ప్రతిపాదనను డీకే తిరస్కరించే అవకాశం ఉందంటున్నారు. అందుకే మిగతా వర్గాలకు ఎలా నచ్చజెప్పాలన్న అంశంపైనా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అప్పగిస్తూ సీఎల్పీలో తీర్మానం చేసింది. సోనియాగాంధీ, రాహుల్‌లతో సంప్రదించాకే ఖర్గే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ కర్ణాటకలో సత్తా చాటాలంటే సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఇద్దర్నీ ఒప్పించి ముందుకు నడవాలని పార్టీ భావిస్తోంది. డీకేతో చర్చించి, ఒప్పించిన తర్వాతే సిద్ధరామయ్య పేరును సీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించవచ్చని తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడినని ఇప్పటికే డీకే స్పష్టం చేశారు. ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలూ తన మద్దతుదారులేనంటూ.. తాను సీఎం రేసులో ముందున్నానని బలంగానే సంకేతాలు ఇచ్చారు. సోమవారం డీకే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అనారోగ్య కారణాలతో ఆగిపోయారు. తాజాగా ఢిల్లీ వెళ్లే ముందు శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడవను, బ్లాక్‌మెయిల్ కూడా చేయనన్నారు. తాను
పార్టీలో చీలిక తీసుకురావాలని అనుకోవడం లేదన్నారు. చెడ్డ పేరుతో చరిత్రలో నిలిచిపోవాలని లేదని స్పష్టం చేశారు. తనకు అర్హత ఉంది అని హైకమాండ్ భావిస్తే పదవి ఇస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయమే తనకు ఫైనల్ అని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలవడమే తన తదుపరి లక్ష్యమని డీకే స్పష్టం చేశారు.

మరోవైపు 70 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా, 60 మంది రహస్య ఓటింగ్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ నేతలు సోమవారమే ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చలు జరిపారు. మొత్తంమీద కర్ణాటక సీఎం ఎవరో నేడు తేలిపోనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News