BigTV English

Working Woman Alimony: భార్యకు సంపాదన ఉన్నా భరణం చెల్లించాల్సిందేనని ఒక హైకోర్టు.. చెల్లించకూడదని మరో హై కోర్టు!

Working Woman Alimony: భార్యకు సంపాదన ఉన్నా భరణం చెల్లించాల్సిందేనని ఒక హైకోర్టు.. చెల్లించకూడదని మరో హై కోర్టు!

Working Woman Alimony| విడాకుల తరువాత మాజీ భార్యకు భరణం ఇవ్వాలని భారతదేశ చట్టాలు చెబుతున్నాయి. అయితే సదరు భార్య ఉద్యోగం, ఏదైనా వృత్తి లేదా బిజినెస్ చేసి సంపాదిస్తుంటే.. ఆమె ఆ సమయంలో కూడా భరణం చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వాదనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే ఒక కేసులో బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఒక స్త్రీ ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు తన మాజీ భర్త నుండి ఆర్థిక సహాయం అందాలని, ఆమె వివాహ జీవితంలో అలవాటు పడిన జీవన ప్రమాణాలను కొనసాగించే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. జూన్ 18న ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ఇచ్చారు.


ఈ కేసులో, ఒక వ్యక్తి తన భార్యకు నెలకు రూ. 15,000 భరణం చెల్లించాలని 2023 ఆగస్టులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తూ నెలకు రూ. 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తుందని, కాబట్టి ఆమెకు తన నుండి అధిక భరణం అవసరం లేదని వాదించాడు. అయితే, హైకోర్టు అతని వాదనను తిరస్కరించింది.

కోర్టు తన తీర్పులో.. భార్య సంపాదిస్తున్నప్పటికీ, ఆమె ఆదాయం ఆమె సొంత ఖర్చులకు సరిపోదని పేర్కొంది. ఆమె ఉద్యోగం కోసం రోజూ దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంది. ఇది ఆమెకు ఆర్థిక భారం కలిగిస్తుంది. ఈ ఆదాయంతో ఆమె మంచి జీవన ప్రమాణాలను కొనసాగించలేకపోతుందని కోర్టు స్పష్టం చేసింది. “ఒక మహిళ సంపాదిస్తుందనే కారణంతో ఆమెను ఆమె భర్త నుండి అందే ఆర్థిక సహాయం నుండి నిలిపివేయకూడదు. ఆమె వివాహ జీవితంలో అలవాటు పడిన జీవన ప్రమాణాలను ఆమె కొనసాగించే హక్కు ఉంది,” అని జస్టిస్ దేశ్‌పాండే తెలిపారు.


ఈ కేసులో.. భర్త తనకు తగిన ఆదాయం లేదని, తన భార్యకు ప్రతినెలా రూ.15,000 భరణం చెల్లించడం సాధ్యం కాదని, తన తల్లిదండ్రులు, వారి అనారోగ్యానికి అయ్యే ఖర్చులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని వాదించాడు. అయితే, భార్య ఈ వాదనలను ఖండించింది. తన భర్త నెలకు రూ. 1 లక్షకు పైగా సంపాదిస్తున్నాడని చెప్పింది. కోర్టు ఈ విషయాన్ని పరిశీలించి.. భర్తకు ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేవని, అతని తండ్రికి నెలకు రూ. 28,000 పెన్షన్ వస్తుందని, కాబట్టి అతని తల్లిదండ్రులు అతనిపై ఆధారపడి లేరని నిర్ధారించింది.

ప్రస్తుతం భార్య తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివసిస్తున్నప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదని, అక్కడే ఎక్కువ కాలం ఉండడం ఆమె పట్టింటి వారికి అసౌకర్యం కలిగిస్తుందని కోర్టు గమనించింది. భర్త, భార్య ఆదాయాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని.. ఈ రెండింటినీ సమానంగా పోల్చలేమని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన రూ. 15,000 భరణం ఆదేశాన్ని రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

సంపాదించే భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు.. ఏపి హై కోర్టు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2017 సంవత్సరంలో ఒక ముఖ్యమైన తీర్పులో, ఒక స్త్రీ ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుంటే, ఆమెకు భర్త నుండి భరణం అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో, ఒక మహిళ తన భర్త తనను నిర్లక్ష్యం చేశాడని, తనకు స్వతంత్రంగా జీవించడానికి ఆదాయం లేదని వాదిస్తూ కోర్టులో భరణం కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఆమె భర్త ఒక లెక్చరర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 15,000 జీతం పొందుతున్నాడని, అంతేకాకుండా అతనికి భూమి, ఇతర స్థిర ఆస్తులు ఉన్నాయని ఆమె చెప్పింది.

అయితే, భర్త ఈ వాదనలను ఖండించాడు. తన భార్య తనతో కేవలం 12 రోజులు మాత్రమే ఉందని, ఆ తర్వాత అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదని అన్నాడు. ఆమె వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె తల్లిదండ్రులు జరిపించారని, ఆమెకు మరొక వ్యక్తిని ప్రేమిస్తోందని..అతనితో ఫోన్‌లో తరచూ మాట్లాడేదని ఆయన వాదించాడు. అంతేకాకుండా, ఆమె ఉద్యోగం చేస్తూ తనను తాను పోషించుకోగలదని, కాబట్టి ఆమెకు భరణం అవసరం లేదని ఆయన పేర్కొన్నాడు.

ఈ కేసును విచారణ చేసిన ఫ్యామిలీ కోర్టు మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు నెలకు రూ. 4,000 భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన భర్త, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

హైకోర్టులో జస్టిస్ శివ శంకర రావు ఈ కేసును విచారణ చేసి.. ఆమె ఇంకా ఉద్యోగంలో ఉందని, ఆమె ఉద్యోగం నుండి తొలగించబడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గమనించింది. ఆమె నెలకు రూ. 20,000 జీతం పొందుతున్నట్లు నియామక ఆదేశం చూపిస్తుందని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, భర్త తాను ఉద్యోగం లేని వ్యక్తినని, పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా కూడా పనిచేయలేదని, ఆస్తులు లేవని, ట్యూషన్ల ద్వారా జీవనం సాగిస్తున్నానని వాదించాడు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ శివ శంకర రావు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన రూ. 4,000 భరణం ఆదేశం సమర్థనీయం కాదని, దానిని రద్దు చేయాలని తీర్పు ఇచ్చారు. భార్య సంపాదిస్తున్నందున ఆమెకు భరణం అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇప్పటివరకు చెల్లించిన ఏదైనా భరణం మొత్తాన్ని తిరిగి వసూలు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆమెకు జీవనాధారం కోసం ఆదాయం లేని పరిస్థితి ఏర్పడితే, మారిన పరిస్థితులను చూపిస్తూ కొత్త పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు సూచించింది.

ఈ రెండు తీర్పులు ఒక దానికి మరొకటి వ్యతిరేకంగా ఉన్నా.. వేర్వేరు పరిస్థితులను బట్టి న్యాయస్థానాలు భిన్నంగా తీర్పు చెప్పాయి.

Related News

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగి 10 మంది గల్లంతు

Big Stories

×