Big Stories

Rumeysa Gelgi : ప్రపంచ పొడగరి.. 5 రికార్డుల సొగసరి

Rumeysa Gelgi : రుమేశా గెల్గి(26) నిరుడు తొలిసారిగా విమానం ఎక్కింది. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? తుర్కియే నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన ఆమె కోసం ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ముందువరుసలో ఉన్న ఆరు సీట్లను తొలగించేశారు. ఎందుకంటే గెల్గి అంత పొడగరి. ఎత్తు అక్షరాలా 7 అడుగుల 0.7 అంగుళాలు(215.16 సెంటీమీటర్లు).

- Advertisement -

భూమిపై జీవించి ఉన్న అత్యంత పొడగరిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటికీ గెల్గి పేరే ఉంది. ఇదే కాదండోయ్.. మరో నాలుగు గిన్నిస్ టైటిల్స్ ఆమె పేరిటే ఉన్నాయి. పొడవైన చేతులు, పొడవైన వేళ్లు, పొడవైన వెన్నెముక ఉన్న మహిళగా గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుందామె. అత్యంత పొడవున్న లివింగ్ ఫిమేల్ టీనేజర్ రికార్డు గతంలో ఉండేది.

- Advertisement -

గెల్గి తుర్కియేలో 1 జనవరి 1997న జన్మించింది. ఆమె న్యాయవాది, రిసెర్చర్, వెబ్ డెవలపర్. జీవించి ఉన్న వారిలో అత్యంత పొడవు ఉన్న మహిళగా ఆమె పేరు 2021లో గిన్నెస్ రికార్డులకి ఎక్కంది. ఇదే తొలి రికార్డు కాదు. 2014లో 17 ఏళ్ల వయసులో ఆమె ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). దాంతో టాలెస్ట్ టీనేజర్(ఫిమేల్)గా రికార్డులకి ఎక్కింది.

మొత్తం 5 ప్రపంచ రికార్డులను పదిలం చేసుకున్న మహిళగా ఆమెపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏకంగా ఫీచర్ డాక్యుమెంటరీని రూపొందించింది. డిసెంబర్ 21 నుంచి రాకుటెన్ టీవీ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమ్ చేస్తోంది.వీవర్ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన వ్యాధితో గెల్గి బాధపడుతోంది. ఆమె అంత పొడవు పెరగడానికి కారణం అదే. ప్రపంచంలో ఇప్పటివరకు 50 మంది మాత్రమే దీని బారిన పడ్డారు.

ఇదో రకమైన జన్యులోపం. EZH2 అనే జన్యువు మ్యుటేట్ కావడం వల్ల ఎముకల్లో విపరీతమైన పెరుగుదల నమోదవుతుంది. ఆ ప్రభావం ఇతర జన్యువులపైనా పడి.. అమితమై పొడవు పెరుగుతారు. గెల్గి తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ సగటు ఎత్తే ఉంటారు. వారితో సహా బంధువులు ఎవరిలోనూ వీవర్ సిండ్రోమ్ లక్షణాలు లేవు. ఆమె ఎక్కువ కాలం వీల్‌చెయిర్‌కే అంటి పెట్టుకుని ఉంటుంది. కొద్ది సేపు నడవాలన్నా వాకర్ ఉండాల్సిందే.

పొడవైన అరచేయి కలిగి ఉన్న సజీవ మహిళగా నిరుడు ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ఆమె అర చేతి పొడవు 8.9 అంగుళాలు (22.6సెంటీమీటర్లు). అలాగే మధ్య వేలు పొడవు రికార్డు కూడా ఆమెదే. మధ్యవేలు ఏకంగా 4.4 అంగుళాల (11.2 సెం.మీ) పొడవు ఉంటుంది. ఇక చేతులైతే బారెడు పొడవుంటాయి. కుడి చేయి 9.81 అంగుళాలు(24.93 సెంమీ) ఉంటే.. దాని కన్నా కొద్ది తక్కువగా ఎడమ చేయి 9.55 అంగుళాలు(24.26 సెంమీ) పొడవు ఉంటుంది. ఇక ఆమె వెన్నెముక కూడా అందరికన్నా ఎంతో పొడవు .అది 23.58 అంగుళాలు(59.90 సెంమీ) ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News