Women’s Day Celebrations in London: లండన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఖండాంతరాల్లో ఉన్న తెలుగు మహిళలు సైతం అంగరంగ వైభవంగా జరపుకున్నారు. యూకేలో నివాసం ఉంటున్న తెలుగు ఆడపడుచులంతా లండన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవెంట్లు నిర్వహించారు. ఆటా పాటలతో సందడి చేశారు. ఫ్యాషన్ షోలో మహిళా మణులు క్యాట్ వాక్ చేస్తూ ఆహా అనిపించారు. ఆపదలో ఉన్న మహిళలకు, బాలికల విద్య కోసం నిధులు సమీకరించారు. చివరగా సంప్రదాయ తెలుగు వంటకాలను అందరూ ఎంతగానో ఇష్టంగా తినేశారు.

మహిళల విజయాన్ని సహకారం, స్నేహం, సిస్టర్ హుడ్ అనేవి మూడు స్తంభాలు అనే ఆలోచనతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు, ‘తెలుగు లేడీస్ యూకే’ అనే ఫేస్ బుక్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ను సుమారు 15 ఏళ్ల క్రితం శ్రీదేవి మీనావల్లి అనే మహిళ ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించేందుకు ఈ గ్రూప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్ లో యూకే అంతటా నివసిస్తున్న 5 వేల మందికి పైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజాగా వీరంతా కలిసి లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం అనే కాన్సెప్ట్ తో ఈ వేడుక నిర్వహించారు.
యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ.. విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో సాయం చేయడం తాము ఏర్పాటు చేసిన ‘తెలుగు లేడీస్ యూకే’ ఫేస్ బుక్ గ్రూప్ ప్రధాన ఉద్దేశమని శ్రీదేవి తెలిపారు. మహిళలు, ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక ద్వారా అనేక మందికి ధైర్యం, మార్గ దర్శనం చేస్తున్నట్లు వివరించారు. ఈ వేడుక సందర్భంగా ఛారిటీ రాఫెల్ నిర్వహించి, అవసరంలో ఉన్న మహిళలకు, బాలికల విద్య కోసం నిధులు సమీకరించినట్లు వెల్లడించారు. ఆనందాన్ని పంచుకుంటూనే సమాజానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇక ఈ వేడుకలో యూకేలోని సుమారు 300 మందికి పైగా తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటా పాటలతో ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ షోతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ గాథలను పంచుకుని, అందరికీ స్పూర్తిని కలిగించారు. ప్రముఖ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు మహిళలను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సంప్రదాయ వంటకాలు అందరినీ అలరించాయి. తెలుగు భోజనం, పునుగులు, రుచికరమైన మిఠాయిలు అందరూ హ్యాపీగా తినేశారు. తెలుగు వంటకాలకు అందరూ ఫిదా అయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి మీనావల్లి, జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, సవిత గుంటుపల్లి, శ్రీచరణి, జ్యోతి బాలుసు సహా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Read Also: అమెరికాలోని వార్ మెమోరియల్ దగ్గర తెలుగు జంట పిచ్చి డ్యాన్సులు.. వీసా రద్దు?