National Handloom Day Celebrations In UK: విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్తున్నారు తెలుగు మహిళలు. అందులో భాగంగానే తాజాగా జాతీయ చేనేత దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు మహిళలు ఈ చేనేత వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ చీరలు ధరించి భారతీయ చేనేత వైభవాన్ని చాటిచెప్పారు.
సెంట్రల్ లండన్ తో పాటు బర్మింగ్ హామ్, మాంచెస్టర్, కోవెంట్రీ, రగ్బీ, మిల్టన్ కీన్స్, అమర్షమ్ సహా పలు ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకతను చాటి చెప్పేలా చేనేత చీరలను ధరించి వేడుకలకు హాజరయ్యారు. ఉప్పాడ, పైఠాణీ, అజ్రఖ్, మంగళగిరి, కాంచీపురం, కోటా కాటన్ లాంటి అనేక రకాల చీరలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగులు, డిజైన్లు, నేత పనితనంతో కూడిన ఈ చీరలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల చేనేత కళకు ప్రతీకగా నిలిచాయి.
ఈ చేనేత ఉత్సవాన్ని ‘తెలుగు లేడీస్ ఇన్ యూకే’ ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ శ్రీదేవి మేనవల్లి కో ఆర్డినేట్ చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చేనేతను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంప్రదాయాలపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాల్లో ఉన్న మహిళలు తమ మూలాలను గుర్తు చేసుకునేలా ఈ వేడుక ఒక మంచి అవకాశంగా మారింది.
చేనేత చీరల ప్రదర్శనతో పాటు మహిళలు ఆట పాటలతో సరదాగా గడిపారు. విందు కూడా కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వంటకాలను తీసుకురావడంతో అందరూ కలిసి భోజనం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో కార్యక్రమం మరింత ఉత్సాహం నెలకొంది. సంప్రదాయ దుస్తులు, స్నేహితుల కలయిక, విందు, నృత్యాలతో వేడుక సందడిగా సాగింది.
చేనేత చీరను ధరించడం వెనుక కేవలం అందం మాత్రమే లేదని మహిళలు గుర్తుచేశారు. ప్రతి చీర వెనుక ఒక నేత కార్మికుడి శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకత ఉంటాయని చెప్పారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ వృత్తులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నేత కార్మికులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకలో యూకే నలుమూలల నుంచి తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం తెలుగు సమాజ ఐక్యతను మరోసారి చాటిచెప్పింది. దేశానికి దూరంగా ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న అభిమానాన్ని వారు చాటుకున్నారు.
Read Also: ఒరిజినల్ ‘ఉడిపి’ హోటల్ ఎక్కడుంది? ఇది ఎందుకంత ప్రత్యేకం?