Sci-Fi Mystery Series OTT : అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌకకు నాలుగు నెలలుగా కనిపించకుండా పోయిన మరో నౌక నుంచి సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ను అనుసరించి కెప్టెన్ తన మార్గాన్ని మార్చుకుంటాడు. సముద్రం మధ్యలో కనిపించిన ఆ మిస్సింగ్ షిప్ లో ఒక్క మనిషి కూడా ఉండడు. కానీ అక్కడ దొరికే ఓ చిన్న పిల్లవాడు, వింత త్రిభుజం గుర్తులు, రహస్యమైన బ్లాక్ పిరమిడ్ ఆ ప్రయాణాన్ని మరో ప్రపంచంగా మార్చేస్తాయి. ‘డార్క్’ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మైండ్-బెండింగ్ మిస్టరీ సిరీస్ పేరే ‘1899’. అసలు ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అంటే…
1899లో కెర్బెరోస్ అనే స్టీమ్ షిప్ ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ కు బయలుదేరుతుంది. ఆ నౌకలో డాక్టర్ మౌరా ఫ్రాంక్లిన్, కెప్టెన్ ఐక్ లార్సెన్ సహా వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు ఉంటారు. అదే మార్గంలో నాలుగు నెలల క్రితం ప్రోమీథియస్ అనే మరో నౌక అదృశ్యమై ఉంటుంది. అయితే సడన్ గా కెర్బెరోస్ కు ఆ నౌక నుంచి కోఆర్డినేట్స్ అందుతాయి. కెప్టెన్ ఐక్ ఆ సిగ్నల్ ను అనుసరించి ప్రోమీథియస్ ను వెతుక్కుంటూ వెళ్తాడు.
తీరా నౌక కనిపించినప్పుడు అందులో ఒక్క ప్రయాణికుడు కూడా ఉండడు. కానీ మౌరా ఓ క్యాబినెట్ లో దాక్కున్న ఓ చిన్న బాలుడిని గుర్తిస్తుంది. అతని చేతిలో ఓ చిన్న నల్లటి పిరమిడ్ ఉంటుంది. ఆ బాలుడు మాట్లాడడు. అతని చెవి వెనుక వింత త్రిభుజం గుర్తు ఉంటుంది. ఇక్కడి నుంచి నౌకలో వరుసగా వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంతమంది ప్రయాణికులు చనిపోతారు. కొందరికి తమ గత జీవితాల జ్ఞాపకాలు కనిపిస్తాయి. మౌరా, ఐక్ ఇద్దరి గదుల్లో మంచం కింద రహస్యమైన షాఫ్ట్ లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఒక్కొక్కరి గతంలోకి వెళ్లే మార్గాలు ఉన్నట్టు తెలుస్తుంది.
డేనియల్ అనే మిస్టీరియస్ వ్యక్తి కూడా మౌరా జీవితంలోకి వస్తాడు. బాలుడితో అతనికి ఏదో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు నౌకలోని ప్రయాణికులు తమకు వచ్చిన లేఖల ఆధారంగానే ఈ ప్రయాణంలోకి వచ్చారని మౌరాకు అర్థమవుతుంది. కథ చివరికి ఊహించని మలుపు తిరుగుతుంది. తాము 1899లో నిజమైన నౌకలో ప్రయాణించడం లేదని మౌరాకు అర్థమవుతుంది. కెర్బెరోస్, ప్రోమీథియస్ అనేవి ఓ సిమ్యులేషన్ లో భాగం. అసలు ప్రపంచం 2099లోని ఓ స్పేస్‌షిప్ తో ముడిపడి ఉంటుంది. మౌరా, డేనియల్, వారి కుమారుడు ఎలియట్ మధ్య ఉన్న సంబంధం కూడా ఈ సిమ్యులేషన్‌కు కీలకంగా మారుతుంది.
మరి మౌరా ఎవరిని నమ్మాలి? ఆమె గతాన్ని ఎందుకు తుడిచి పెట్టారు ? ఈ సిమ్యులేషన్ ను ఎవరు రూపొందించారు? 1899 నౌక ప్రయాణం వెనుక ఉన్న ప్రయోగం ఏంటి ? చివర్లో కనిపించే 2099 ప్రపంచం అసలు నిజమేనా ? అనేది తెలుసుకోవాలని ఉంటే ఈ సిరీస్ పై వెంటనే ఒక లుక్కేయండి.
Also Read : డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా
1899 Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ సై-ఫై సిరీస్. ఎమిలీ బీచమ్, అన్యూరిన్ బర్నార్డ్, ఆండ్రియాస్ పీచ్‌మన్ వంటి నటీనటులు ఇందులో భాగం అయ్యారు. ‘Dark’ సృష్టికర్తలు బరాన్ బో ఓడర్, జాంట్జే ఫ్రీస్ రూపొందించిన ఈ సిరీస్ కు ఒక్క సీజన్ మాత్రమే ఉంది/ అందులో 8 ఎపిసోడ్లు ఉన్నాయి.