పాకిస్థానీలకు కొత్త భయం పట్టుకుంది. తాము పాలు పోసి పెంచిన పాములు తిరిగి తమనే కాటేస్తాయనే ఆందోళన వారిని తీవ్రంగా వెంటాడుతోంది. పైగా.. దుబాయ్, యూఏఈలకు సైనిక సాయం కూడా అందిస్తున్న నేపథ్యంలో.. ఇరాన్ తమని కూడా వదిలిపెట్టదని కలవరపెడతోంది. అయితే, వీరికి ఎక్కువ ముప్పు పాకిస్తాన్ తాలిబాన్ (TTP) నుంచే ఎక్కువ ముప్పు ఉంది. వీరి సాయుధ ఉగ్రవాద గ్రూపు నుంచి డ్రోన్ల ముప్పు పొంచి ఉంది. వాటి నుంచి తప్పించుకోడానికి.. వారికి ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. చేప వలలతో ఆ డ్రోన్లను అడ్డుకోవచ్చని భావిస్తోంది.
వాస్తవానికి పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ వాదుల రచ్చ గురించే ఎక్కువ వార్తల్లో చూస్తుంటాం. కానీ, పాక్‌కు అసలైన.. భయానక ముప్పు పాకిస్తాన్ తాలిబాన్ల నుంచి పొంచిఉంది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పంఖుంఖ్యా ప్రావీన్స్ దీనికి కేంద్రంగా మారింది. వీళ్ల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. బాంబులతో నిండిన వాహనాలపై.. సైనిక స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఆత్మహుతి దాడులకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవడానికి పాక్ సైన్యం నానా తంటాలు పడుతోంది. అప్పుడే వారికి చేప వలల ఐడియా వచ్చింది. వాటితో డ్రోన్లను అడ్డుకోవచ్చనేది వారి ప్లాన్.
డ్రోన్, క్వాడ్కాప్టర్ ముప్పును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు సెక్యూరిటీ పోస్టులపై పెద్ద పెద్ద ఫిషింగ్ నెట్లు (చేపల వలలు) ఏర్పాటు చేశాయి. ఇటీవల పాకిస్థాన్ తాలిబాన్ (TTP) వంటి సాయుధ ఉగ్రవాద సంస్థలు పోలీస్, సైనిక పోస్టులపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. గాలిలో ఎగిరివస్తున్న డోన్లు నేరుగా చెక్‌పోస్టులపైకి బాంబులు జారవిడుస్తున్నాయి. ఆ వెంటనే పాక్ సైన్యాన్ని రౌండ్ చేసి.. కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 16న హంగు జిల్లాలోని సర్కి పియాలా పోలీస్ చెక్‌పోస్ట్ పైకి ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు జారవిడిచారు. ఈ తరహా దాడులతో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులకు ఈ ఆలోచన వచ్చింది.
చెక్‌పోస్టుల పైకప్పుల నుంచి పెరిమీటర్ గోడల వరకు కొన్ని మీటర్ల ఎత్తులో ఈ ఫిషింగ్ నెట్లను తాడులు, వైర్ల సహాయంతో గట్టిగా కట్టారు. ఇవి ఒక వలలాంటి పైకప్పులా పనిచేస్తాయి. డ్రోన్లు చెక్‌పోస్ట్ వైపు వస్తే ఈ వలల్లో చిక్కుకుని ఆగిపోవడం, లేదా అక్కడే నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డ్రోన్ ఈ నెట్‌పైన లేదా సమీపంలో పేలినప్పటికీ, దాని నుంచి వచ్చే శకలాలు నేరుగా కింద ఉన్న పోలీసులు లేదా సైన్యంపై పడకుండా గాల్లోనే చెల్లాచెదురై ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఒక సాధారణ చెక్‌పోస్టుకు ఈ రక్షణ వలలను ఏర్పాటు చేయడానికి కేవలం 4,00,000 పాకిస్థానీ రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని హంగు జిల్లా పోలీస్ అధికారి తారిఖ్ హబీబ్ తెలిపారు. ఖైబర్ పంఖుంఖ్వాలోని హంగుతో పాటు కోహత్, కరక్, బన్నూ, లక్కీ మార్వత్, డిరా ఇస్మాయిల్ ఖాన్ వంటి సున్నితమైన జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులతో పాటు కొన్ని సైనిక అవుట్‌పోస్టులలో కూడా ఈ యాంటీ-డ్రోన్ నెట్లను ఏర్పాటు చేశారు.
Also Read: ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!
ఈ నెట్ల ద్వారా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు నష్టాన్ని తగ్గించవచ్చని అంచనా వేస్తుండగా.. భద్రతా నిపుణులు మాత్రం ఇది తాత్కాలిక ఉపాయమేనని అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదులు ప్రధాన ప్రాంతాలను టార్గెట్ చేసే సమయంలో ఈ వలలు ఎంతవరకు రక్షణ కల్పిస్తాయనే దానిపై పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరీక్షలు జరగాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, డ్రోన్ల బెడద నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాకిస్థాన్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు ఈ క్రేజీ ఐడియాలు మీకు ఎలా వస్తాయి రా బాబు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే.. డ్రోన్లు విడిచే బాంబు పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం ఛిద్రం చేస్తాయి. అలాంటిది.. వాటికి ఈ నెట్‌లు ఒక లెక్కా అని అంటున్నారు.