OTT Movie : ప్రతీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు ఉంటాయి. అయితే వాటిని తెరపై మనసుకు హత్తుకునే విధంగా అందించే డైరెక్టర్ ఉంటే, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను చూడడానికి థియేటర్లకు జనాలు పరుగులు తీయడం ఖాయమని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. మరి ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. అది కూడా మలయాళ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లి, అంతలోనే పిల్లల గొడవ… ఆ తరువాత కథ ఏమైందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ కేరళలోని కన్నూర్‌లోని ఒక గ్రామంలో నడుస్తుంది. నకులన్ (అర్జున్ అశోకన్), ఒక లాటరైట్ స్టోన్ క్వారీ వ్యాపారి. శాలిని (అనఘ నారాయణన్)తో అతనికి పెళ్లవుతుంది. ఈ కొత్త జంట వైవాహిక జీవితం ప్రారంభంలో సంతోషంగా, పరస్పర అవగాహనతో నడుస్తుంది. అయితే కొన్ని నెలల్లోనే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇలా పెళ్లి అయ్యిందో లేదో అలా నస మొదలవుతుంది. కుటుంబ సభ్యులు నుంచి మొదలు పెడితే గ్రామస్థుల వరకు ప్రతి ఒక్కరూ “శుభవార్త ఎప్పుడు?” అనే ప్రశ్నతో ఈ జంటను వేధిస్తారు. ముఖ్యంగా శాలిని పిల్లల గురించి ఎదురవుతున్న ఒత్తిడితో సతమతమవుతుంది. ఈ ఒత్తిడి శాలిని మనస్తత్వంపై ప్రభావం చూపుతుంది. ఇంకేముంది ఆమె ఆనందం క్రమంగా నిరాశ, కోపంగా మారుతుంది. ఒక బంధువుతో జరిగిన వాగ్వాదం కథలో కీలక మలుపును తెస్తుంది, ఇది శాలిని, నకులన్‌ల జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఆ మార్పు ఏంటి? ఈ పిల్లల గోలకు వాళ్ళు ఎలా ఫుల్ స్టాప్ పెట్టారు? క్లైమాక్స్ ఏంటి? అన్న విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా పేరు ‘అన్పోడు కన్మణి’ (Anpodu Kanmani). లిజు థామస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్, అనఘ నారాయణన్ ప్రధాన పాత్రలలో నటించారు. విపిన్ పవిత్రన్ నిర్మించిన ఈ మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మాక్స్ (Manorama Max) ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ ఏడాది మార్చి 26 న థియేటర్లలోకి వచ్చిన ఈ మలయాళ మూవీకి బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.