Aajo Ardhangini on OTT: మానవ సంబంధాలు, వాటిలోని సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో జాతీయ అవార్డు గ్రహీత కౌశిక్ గంగూలీ సిద్ధహస్తుడు. గతంలో సంచలన విజయం సాధించిన ‘అర్ధాంగిని’ చిత్రానికి కొనసాగింపుగా, ఒకే వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న ఇద్దరు మహిళల మధ్య జరిగే మానసిక సంఘర్షణతో ‘ఆజో అర్ధాంగిని’ (Aajo Ardhangini) మూవీని కౌశిక్ గంగూలీ అద్భుతంగా తెరకెక్కించాడు. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సున్నితమైన కథాంశం, అద్భుతమైన నటనతో మనసును తాకే ఈ బెంగాలీ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ ఇద్దరు అర్ధాంగుల కథేంటో ఇప్పుడు చూద్దాం.
శుభ్ర (చూర్ణి గంగూలీ), సుమన్ (కౌశిక్ సేన్) విడిపోయి రెండేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత సుమన్ మరో పెళ్లి చేసుకుని మేఘ్న (జయా అహ్సన్)తో కలిసి జీవిస్తుంటాడు. ఇంతలో సుమన్ తమ్ముడి పెళ్లి వేడుకకు శుభ్ర మళ్లీ చాటర్జీ కుటుంబంలోకి అడుగుపెడుతుంది. ఆమె రాకతో మేఘ్నలో అలజడి మొదలవుతుంది. గతంలో జరిగిన సంఘటనలు, ఇద్దరి మధ్య ఉన్న పాత పరిచయం మళ్లీ తెరపైకి వస్తాయి.
ఇదిలా ఉంటే, మేఘ్నకు ప్రెగ్నెన్సీ అని తెలిసి కుటుంబంలో కొత్త కలకలం మొదలవుతుంది. సుమన్‌కు సంతానం కలిగే అవకాశం లేదని ముందే తెలుసు. దీంతో మేఘ్న తన పాత ప్రేమికుడు రంజన్‌తో (ఇంద్రాశిష్ రాయ్) సంబంధం పెట్టుకుందని అనుమానిస్తాడు. ఈ అనుమానం కాస్తా ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది. చివరకు మేఘ్న ఇంటిని వదిలి వెళ్లిపోతుంది.
అయితే కథ ఇక్కడితో ఆగదు. మేఘ్నకు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. ఆ క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలిచేది సుమన్ మాజీ భార్య శుభ్రే. ఒకప్పుడు ఒకే వ్యక్తితో ముడిపడిన జీవితాలు ఇప్పుడు ఊహించని పరిస్థితుల్లో మళ్లీ కలుస్తాయి. మేఘ్నకు నిజంగా ఏమైంది? ఆమె ప్రెగ్నెన్సీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? శుభ్ర ఆమెకు ఎందుకు అండగా నిలబడింది? సుమన్ తన అనుమానాల నుంచి బయటపడి నిజాన్ని అర్థం చేసుకుంటాడా? అనేదే మిగతా కథ. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.
‘ఆజో అర్ధాంగిని’ సినిమాలో శుభ్రగా చూర్ణి గంగూలీ, మేఘ్నగా జయా అహ్సన్, సుమన్‌గా కౌశిక్ సేన్ నటించారు. వీరితో పాటు ఇంద్రాశిష్ రాయ్, అంబరీష్ భట్టాచార్య, లిలీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కౌశిక్ గంగూలీ రచన, దర్శకత్వం వహించగా, అనుపమ్ రాయ్ సంగీతం అందించారు. 2023లో విడుదలైన ‘అర్ధాంగిని’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా 2026 జూలై 10న థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ 18 నుంచి Hoichoi ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ బెంగాలీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం లేదు.
Read Also: బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్