Brazilian Romantic Comedy: సాధారణంగా ప్రేమలో మోసపోయి బ్రేకప్ ఎదురైతే చాలామంది బాధపడుతూ కొంతకాలం ఒంటరిగా గడుపుతారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనను మోసం చేసిన మాజీ ప్రియుడికి బుద్ధి చెప్పడంతో పాటు, తనకు సరైన జోడీని వెతుక్కోవడానికి ఏకంగా జ్యోతిష్య శాస్త్రాన్నే నమ్ముకుంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశులకు చెందిన 12 మంది అబ్బాయిలతో డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ వింతైన ఆలోచన చుట్టూ రూపొందిన బ్రెజిలియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘వాలెంటినా అండ్ ది 12 సైన్స్’ (Valentina and the 12 Signs) ఈ రోజు (నవంబర్ 18) నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? వాలెంటినా డేటింగ్ ప్రయోగం ఎలాంటి మలుపులు తిరిగింది? తెలుసుకుందాం పదండి.
వాలెంటినా ఒక ఆధునిక భావాలు కలిగిన యువతి. తన ప్రియుడిని ఎంతో నమ్మిన ఆమెకు, అతడు మోసం చేసి బ్రేకప్ చెప్పడంతో గుండె పగిలినంత పనవుతుంది. అయితే తమ బంధం విఫలం కావడానికి కారణం ఇద్దరి రాశులు కలవకపోవడమేనని ఆమె భావిస్తుంది. దీంతో మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, తనకు సరైన జీవిత భాగస్వామిని గుర్తించడానికి ఒక విచిత్రమైన ప్లాన్ వేస్తుంది.
మేషం నుంచి మీనం వరకు 12 రాశులకు చెందిన ఒక్కో అబ్బాయితో డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు, ప్రతి డేట్‌లో ఎదురైన అనుభవాలను లైవ్‌స్ట్రీమ్‌లో పంచుకోవాలని అనుకుంటుంది. ఒక్కో రాశికి చెందిన అబ్బాయిలతో పరిచయం పెంచుకుంటున్న కొద్దీ, వారి స్వభావాలు, అలవాట్లు, ప్రవర్తనల వల్ల వాలెంటినాకు రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో జరిగే సరదా సంఘటనలు నవ్వులు పూయిస్తాయి. అయితే ఆమె వేసుకున్న ఈ డేటింగ్ ప్లాన్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. జాతకాలు, రాశుల గురించి ఏమాత్రం పట్టించుకోని ఓ వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. అతడితో ప్రేమలో పడిన తర్వాత వాలెంటినా ఆలోచనలు మారతాయా? రాశుల ఆధారంగా ప్రేమను వెతుక్కోవాలనుకున్న ఆమెకు చివరకు ఎలాంటి సమాధానం దొరికిందనేదే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.
ఈ సిరీస్‌లో వాలెంటినా పాత్రలో జియోవన్నా గ్రిజియో (Giovanna Grigio) నటించగా, జోస్ కొండెస్సా (José Condessa), జెస్సికా మార్క్వెస్ (Jessica Marques), మను మోరెల్లి (Manu Morelli), లారిస్సా బోచ్చినో (Larissa Bocchino), లూకాస్ లెటో (Lucas Leto), పెడ్రో ఒట్టోని (Pedro Ottoni), అనా హికారి (Ana Hikari), సుజానా పైర్స్ (Suzana Pires) తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీనికి కరోల్ డురావో దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ బ్రెజిలియన్ సిరీస్ 2026 నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ భాష పోర్చుగీస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఇది అందుబాటులో ఉంది.