Korean Horror Series on Netflix : డబ్బులు లేక అప్పులు పెరిగిపోయి, డైలీ ఖర్చులు కూడా భారంగా మారినప్పుడు… మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరికితే అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాంటిది సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే ఏకంగా 50 రెట్లు ఎక్కువ జీతం ఇస్తామంటే ఎవరైనా ఆలోచించకుండా ఒప్పుకుంటారు. కానీ ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కో షిఫ్ట్ ప్రాణాల మీదకు వస్తే… ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కొరియన్ హారర్ మిస్టరీ ఫాంటసీ సిరీస్ ‘డెడ్ ఎండ్ జాబ్’ (Dead-End Job) ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ జీతం వెనుక దాగిన భయంకరమైన రహస్యాలేంటి ? ఈ ఉద్యోగంలో చేరిన యువకుడికి ఎదురైన అనుభవాలేంటి ? తెలుసుకుందాం పదండి.
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బ్యూన్ హ్యోక్ – జున్ కు జీవితంలో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఎంత కష్టపడినా అప్పులు తీరకపోవడంతో డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాల కోసం వెతుకుతుంటాడు. అలాంటి సమయంలో అతడికి స్పైడర్ స్టాఫింగ్ ఏజెన్సీ నుంచి ఓ విచిత్రమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుస్తుంది. సాధారణంగా వచ్చే గంట జీతానికి ఏకంగా 50 రెట్లు చెల్లిస్తామంటూ ఆ ఏజెన్సీ ప్రకటన ఇస్తుంది. ఆ ఆఫర్ చూసిన హ్యోక్ – జున్ కు ఇదొక అదృష్టంగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఏజెన్సీని సంప్రదించి ఉద్యోగానికి అంగీకరిస్తాడు. అయితే అక్కడ ఒక షరతు ఉంటుంది. ఉద్యోగంలో ఏం జరిగినా బయట ఎవరికీ చెప్పకూడదు.
మొదట ఈ రూల్ అతడికి పెద్దగా అనుమానం కలిగించదు. కానీ అతడికి ఇచ్చిన మొదటి పని ఓ నార్మల్ కన్వీనియన్స్ స్టోర్ లో నైట్ షిఫ్ట్ చేయడం. అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు విషయం అర్థమవుతుంది. బయటకు మామూలు దుకాణంలా కనిపించే ఆ ప్రదేశంలో వింత సంఘటనలు, భయంకరమైన జీవులు ఎదురవుతాయి. అక్కడ పని చేయాలంటే కొన్ని విచిత్రమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఈ అనుభవంతో భయపడిపోయిన హ్యోక్-జున్ ఇక ఇలాంటి పనులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పుల బాధ అతడిని మళ్లీ అదే ఏజెన్సీ వైపు నడిపిస్తుంది. ఈసారి అతడికి ఓ విదూషకుడిని ఎప్పుడూ కళ్లముందే ఉంచుకోవాల్సిన విచిత్రమైన పని అప్పగిస్తారు. ఆ తర్వాత పాల డెలివరీ, అర్ధరాత్రి సినిమా థియేటర్, క్లినికల్ ట్రయల్, నిర్మాణ స్థలం… ఇలా ఒక్కో ఉద్యోగం అతడిని మరో భయంకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
మరోవైపు ఈ ఏజెన్సీ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు యోన్-జూ అనే ఇన్వెస్టిగేటర్ ప్రయత్నిస్తుంటుంది. హ్యోక్-జున్ సోదరి బ్యూన్ జీ-యూన్ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారుతుంది. అసలు స్పైడర్ ఏజెన్సీని నడిపిస్తున్న మిస్టర్ ఎస్ ఎవరు? ఇంత భారీ జీతాలు ఇచ్చి ఉద్యోగులతో ప్రమాదకరమైన పనులు ఎందుకు చేయిస్తున్నాడు ? ఈ ఉద్యోగాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? హ్యోక్-జున్ ఈ భయానక ప్రపంచం నుంచి బయటపడగలడా ? అనేదే మిగతా కథ.
Also Read : వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్
‘డెడ్-ఎండ్ జాబ్’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్‌ను కొరియన్తో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఆడియోల్లోనూ చూడొచ్చు. లీ జే-వూక్ (Lee Jae-wook), గో మిన్-సి (Go Min-si), కిమ్ మిన్-హా (Kim Min-ha), లీ హీ-జూన్ (Lee Hee-joon) ప్రధాన పాత్రల్లో నటించారు. కిమ్ డా-మిన్ (Kim Da-min) దర్శకత్వం వహించగా, హాన్ జూన్-హీ (Han Jun-hee) క్రియేటర్‌గా వ్యవహరించారు. ప్రతి ఎపిసోడ్లో కొత్త ఉద్యోగం, కొత్త ప్రమాదం, ఊహించని భయానక పరిణామాలతో సాగుతుంది ఈ సిరీస్. వీకెండ్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భయపెడుతూ ఎంటర్టైన్ చేసే కొరియన్ సిరీస్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.