German Dark Comedy Thriller: మనలో చాలామందికి పిల్లల బర్త్‌డే పార్టీలు అంటే చాలా ఇష్టం. ఎంతో ఆనందంగా, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఈ పార్టీల్లో ఒక చిన్న గిఫ్ట్ రాద్ధాంతం సృష్టించి, పెద్దల మధ్య చిచ్చు పెడితే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో జర్మన్ భాషలో తెరకెక్కిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘ది బర్త్‌డే గిఫ్ట్’ (The Birthday Gift). ఇప్పుడు ఓటీటీలో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియన్స్‌ను నవ్విస్తోంది ఈ మూవీ. ఒక పార్టీలో జరిగే ఊహించని పరిణామాలు, ఆ గిఫ్ట్ వల్ల వచ్చిన పంచాయతీలు, ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. చిన్న పాయింట్‌ను ఎంత ఇంట్రెస్టింగ్‌గా మలచవచ్చో దర్శకుడు ఈ సినిమాతో నిరూపించారు. వీకెండ్‌లో కాస్త డిఫరెంట్ జోనర్‌లో నవ్వుకునేలా సినిమా చూడాలనుకుంటే ఈ జర్మన్ ఎంటర్‌టైనర్‌కు ఒక లుక్ వేయండి. మరి సినిమాను ఎక్కడ చూడవచ్చు అంటే…
మార్లిన్ తన కొడుకు థియో పుట్టినరోజును ఎంతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం తన సోదరుడు టీమో విలాసవంతమైన కంట్రీ విల్లాను వేదికగా ఎంచుకుంటుంది. పిల్లల కోసం బెలూన్లు, గ్లూటెన్ ఫ్రీ కేక్, పీనాటా, ఆటలు.. ఇలా ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేస్తుంది. అంతేకాదు, పిల్లలు సరదాగా గడిపేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోందని మార్లిన్ సంతోషించే సమయంలో ఓ చిన్న బహుమతి పెద్ద సమస్యకు కారణమవుతుంది. థియోకు ఎవరో ఒక బొమ్మ తుపాకీని గిఫ్ట్‌గా ఇస్తారు. అది చూసిన పెద్దల మధ్య ఒక్కసారిగా వాదనలు మొదలవుతాయి. పిల్లలకు ఇలాంటి బొమ్మలు ఇవ్వడం సరైనదేనా ? ముఖ్యంగా మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఎలాంటి అలవాట్లు నేర్పించాలి ? అనే చర్చ కాస్తా తీవ్ర వాగ్వాదంగా మారుతుంది.
ఈ గొడవలో మార్లిన్ సోదరుడు టీమో కూడా తన అభిప్రాయాలను గట్టిగా వినిపిస్తాడు. మరోవైపు మార్లిన్ తండ్రి హాన్స్ పాతతరం ఆలోచనలతో తన వాదనను కొనసాగిస్తాడు. మార్లిన్ సహోద్యోగి జెన్నీ మాత్రం పిల్లల పెంపకం విషయంలో డిఫరెంట్ ఆదర్శాలను ప్రస్తావిస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉండటంతో పుట్టినరోజు వేడుక కాస్తా పెద్దల మధ్య చర్చలకు వేదికగా మారుతుంది. పిల్లల అల్లరి ఒకవైపు, పెద్దల మధ్య సిద్ధాంతపరమైన గొడవలు మరోవైపు… ఇలా పరిస్థితి అదుపు తప్పుతుంది. మొదట చిన్న విషయంగా కనిపించిన బొమ్మ తుపాకీ, కుటుంబ సభ్యుల పాత విభేదాలను బయటపెడుతుంది. చివరికి ఆ పుట్టినరోజు వేడుక ఎలాంటి గందరగోళానికి దారితీసింది ? కుటుంబ సభ్యులు తమ విభేదాలను ఎలా పరిష్కరించుకున్నారు ? చివరికి ఏమైంది ? అనేదే ఇందులో చూసి తెలుసుకోవలసిన కథ.
‘ది బర్త్‌డే గిఫ్ట్’ (The Birthday Gift / Das Geschenk) జర్మన్ కామెడీ మూవీ. పిల్లల పెంపకం, కుటుంబ సంబంధాలు, తరాల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలను హాస్యభరితంగా చూపించే ఈ చిత్రంలో జీన్ గోర్సాడ్, ఎడిన్ హసనోవిక్, హైనర్ లాటర్‌బాక్, అమల్ కెల్లర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో జర్మన్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల ఆడియో ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులా మధ్య జరిగే సరదా గొడవలు, చిన్న విషయాల నుంచి పెద్ద పంచాయతీలు పుట్టే కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్‌గా అనిపించవచ్చు.
Read Also: ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్ నాన్‌స్టాప్ ఫన్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… తెలుగులోనూ స్ట్రీమింగ్