Malayalam Family Comedy: మలయాళ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సహజమైన కామెడీకి కూడా ప్రత్యేకంగా చోటు కల్పిస్తారు మేకర్స్. ముఖ్యంగా బిజు మీనన్ (Biju Menon) తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో ముందుంటారు. అలాంటి ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అవరాచ్చన్ అండ్ సన్స్’ (Avaraachan & Sons) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బాధ్యత లేకుండా తాగుతూ, ఊళ్లో గొడవలు పెట్టుకునే ఓ తండ్రి వల్ల అతని ఇద్దరు కొడుకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ? మరి ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ కథేంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కేరళలోని చెల్లానమ్ అనే తీరప్రాంత గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. అవరాచ్చన్ భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తుంటాడు. అయితే బాధ్యతగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన అతను నిత్యం మద్యం తాగుతూ, అల్లరి చిల్లరి పనులతో ఊళ్లో గొడవలు తెచ్చుకుంటుంటాడు. అతని పెద్ద కొడుకు జైసన్, చిన్న కొడుకు జైమోన్ లు తండ్రి చేసే పనుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించలేక విసిగిపోతుంటారు. ఒకరోజు అవరాచ్చన్ మద్యం మత్తులో చేసిన ఓ పెద్ద రచ్చ కారణంగా గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలవుతాయి. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో కొడుకులు తమ తండ్రిని ఊరి నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంటారు.
దీంతో అవరాచ్చన్ తనకు అలవాటైన తీరప్రాంత గ్రామాన్ని వదిలి ఉత్తర కేరళలోని కొండ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తన అక్క ఎలియమ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఎప్పుడూ గొడవలు, స్నేహితులు, మద్యం మధ్య గడిపే అవరాచ్చన్‌కు కొత్త ప్రాంతంలో జీవితం పూర్తిగా కొత్తగా ఉంటుంది. అక్కడ పొరుగింట్లో ఉండే బిన్సీ తో పాటు మరికొందరు వ్యక్తులు పరిచయమవుతారు. అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు అవరాచ్చన్ జీవితంలో అనుకోని మార్పులు తీసుకొస్తాయి. మరోవైపు అతని కొడుకులు కూడా తండ్రి దూరంగా వెళ్లిన తర్వాత కుటుంబ బంధాల విలువను అర్థం చేసుకుంటారు.
ఇంతకాలం తన ఇష్టానుసారంగా బతికిన అవరాచ్చన్, ఈ కొత్త ప్రయాణంలో తన తప్పులను గుర్తించాడా ? కొడుకులతో అతని సంబంధం ఎలా మారింది ? తండ్రి, కొడుకులు మళ్లీ ఒక్కటయ్యారా ? ఈ క్రమంలో ఎదురయ్యే ప్రేమ కథలు, గ్రామీణ గొడవలు, సరదా సంఘటనలు కథలో ఎలాంటి మలుపులు తీసుకొచ్చాయి ? అనేదే మిగతా కథ.
‘అవరాచ్చన్ అండ్ సన్స్’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఆడియోల్లోనూ అందుబాటులో ఉంది. దర్శకుడు అమల్ షీలా తంబి (Amal Sheela Thamby) ఈ సినిమాను తెరకెక్కించారు. బిజు మీనన్ (Biju Menon), శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi), గణపతి (Ganapathi) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వాళ్ళు దీన్ని వీకెండ్ లో కుటుంబ సమేతంగా చూసి నవ్వుకోవడం మరచిపోవద్దు.
Read Also: దెయ్యాలతో హాలోవీన్ సెలబ్రేషన్స్… అద్దంలో అరాచకం… నవ్విస్తూనే భయపెట్టే సిరీస్