E-Paper
Advertisement

మిస్సింగ్‌ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్

మిస్సింగ్‌ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్
Advertisement

Crime Investigation Thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి వారి కోసమే మరో ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. మారుమూల గ్రామంలో ఓ వ్యక్తి కనిపించకుండా పోవడం… ఆ తర్వాత తల లేని మొండెం బయటపడటంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌కు ఒక్కో అడుగులోనూ కొత్త చిక్కులు ఎదురవుతుంటాయి. ఇలా ఎన్నో మలుపులతో రూపొందిన ఈ సిరీస్ పేరే ‘రుద్రవనం పీఎస్’ (Rudravanam PS). మరి ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజమేంటి ? ఈ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ అంతా రుద్రవనం అనే మారుమూల గ్రామం, అక్కడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో చంద్ర అనే వ్యక్తి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కథ మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్తీసుకుంటాడు. నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్‌గా పేరున్న శివకుమార్, చంద్ర ఆచూకీ కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో రుద్రవనం అడవి ప్రాంతంలో ఓ తల లేని మొండెం బయటపడుతుంది. దీంతో ఆ శవం ఎవరిది? కనిపించకుండా పోయిన చంద్రదేనా? లేక ఈ రెండు ఘటనల వెనుక వేరే రహస్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు మొదలవుతుంది.

Advertisement

ఈ కేసును లోతుగా విచారిస్తున్న కొద్దీ శివకుమార్‌కు స్థానిక రాజకీయ నాయకుల నుంచి, పై అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. అయినా వెనక్కి తగ్గకుండా ఒక్కో ఆధారాన్ని పరిశీలిస్తుంటాడు. ఈ క్రమంలో ఊరిలోని అవినీతి, అధికార బలం, కుల వివక్ష, పాత పగలు వంటి ఎన్నో విషయాలు బయటపడతాయి. దీంతో ఇది కేవలం ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు లేదా హత్య కేసు కాదని శివకుమార్‌కు అర్థమవుతుంది. మరోవైపు సీఐ వేణుగోపాల్, ఏఎస్ఐ మాధవ్, ఏఎస్ఐ నిర్మల, హెడ్ కానిస్టేబుల్ సుందర్ కూడా ఈ దర్యాప్తులో భాగమవుతారు.

విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో అంజి అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోతాడు. తానే చంద్రను హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు. అయితే అతని వాంగ్మూలాన్ని మరింత లోతుగా పరిశీలించిన శివకుమార్ బృందానికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఇది ఒక్క హత్యతో ముగిసిపోయే వ్యవహారం కాదని, ఆ గ్రామంలో దాదాపు ఎనిమిది మందిని చంపిన సీరియల్ కిల్లర్‌కు సంబంధించిన భయంకరమైన రహస్యం దాగి ఉందని బయటపడుతుంది. అంతేకాదు, ఎన్నో రోజులుగా దాచిపెట్టిన శవాలు, వాటి వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి.

Advertisement

అసలు అంజి చెప్పిన విషయాల్లో ఎంత నిజం ఉంది ? రుద్రవనంలో వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ? అతని వెనుక ఎవరైనా ఉన్నారా ? స్థానిక రాజకీయాలు, అధికారుల ఒత్తిళ్ల మధ్య శివకుమార్ ఈ కేసును ఎలా ఛేదించాడు ? దాచిపెట్టిన శవాల వెనుక ఉన్న అసలు కథేంటి ? అనేది సిరీస్‌లో చూడాల్సిన ఆసక్తికరమైన కథ.

ఏడు ఎపిసోడ్లతో తెలుగులోనే స్ట్రీమింగ్

‘రుద్రవనం పీఎస్’ అక్టోబర్ 30 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఏడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ మినీ సిరీస్ తెలుగు ఆడియోలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు శశిధర్ మున్నంగి (Sasidhar Munnangi) ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథను ఉత్కంఠభరితంగా తెరకెక్కించగా, నరేశ్ అగస్త్య (Naresh Agastya)తో పాటు శ్రావణి రెడ్డి (Shravani Reddy), ప్రీతి సుందర్ (Preeti Sundar), నారాయణ స్వామి (Narayana Swamy) తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Read Also: ప్రపంచాన్నే వణికించిన రియల్ డాన్‌… దశాబ్దాల పరార్‌కు తెరదించిన అరెస్ట్‌… ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

Tags

Related News

తాగుడు అలవాటుతో ఊరంతా రచ్చ… తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ గోల చూస్తే నవ్వు ఆగదు

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్..!

ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్ నాన్‌స్టాప్ ఫన్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… తెలుగులోనూ స్ట్రీమింగ్

శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

42 ఏళ్ల బంధానికి టాటా… గుహలోకి వెళ్ళి 20 ఏళ్ల యంగ్ కపుల్ గా రీఎంట్రీ… ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ తెలుగులోనే

లగ్జరీ ఫ్లాట్‌ అద్దెకిచ్చే అందమైన అమ్మాయి… కలల ఇల్లు కాస్తా భయంకరమైన పీడకలగా మారితే… తమిళ హర్రర్ మూవీ తెలుగులో

ఓటీటీలోకి అడుగు పెట్టిన సీఎం విజయ్ కొడుకు ఫస్ట్ మూవీ… ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

Advertisement
×