Christmas Musical Drama: క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు.. ఫ్యామిలీ బాండింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హాలీవుడ్ చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు అలాంటి పండుగ వాతావరణానికి సంగీతాన్ని, కామెడీని, ఎమోషన్స్‌ను జోడించి తెరకెక్కించిన లేటెస్ట్ క్రిస్మస్ స్పెషల్ మూవీ ‘Tyler Perry’s The Gospel of Christmas’. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ ఫీల్-గుడ్ డ్రామా ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లిస్ట్‌లో దూసుకుపోతోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు టైలర్ పెర్రీ రూపొందించిన ఈ మ్యూజికల్ డ్రామా చర్చిని కాపాడుకోవడానికి ఓ పాస్టర్ చేసే ప్రయత్నాలు, అతని కుటుంబం ఎదుర్కొనే సమస్యలు, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో క్రేజీగా సాగుతుంది.
ఐజాక్ అనే వ్యక్తి ఒకప్పుడు ఆర్‌అండ్‌బీ సింగర్. అయితే జీవితంలో వచ్చిన మార్పులతో పాస్టర్‌గా మారతాడు. తన తండ్రి అబ్రహం మరణం తర్వాత, ఆయన కోరిక మేరకు కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని ఒక సమస్యాత్మక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ తన కుటుంబానికి చెందిన పాత చర్చిని తిరిగి నిలబెట్టే బాధ్యత ఐజాక్‌పై పడుతుంది. కానీ అప్పటికే ఆ చర్చి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, తనఖా బకాయిల కారణంగా మూతపడే పరిస్థితికి చేరుకుంటుంది. ఐజాక్ భార్య రెబెక్కా మాత్రం ఎలాగైనా చర్చిని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలని పట్టుదలతో ఉంటుంది.
అయితే కొత్త ప్రాంతంలో చర్చిని నడపడం అంత సులభం కాదు. అక్కడి ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించదు. చుట్టుపక్కల వాళ్లతోనూ కుటుంబానికి చిన్నచిన్న గొడవలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మిస్టర్ లివ్డ్ అనే వ్యక్తి అతడికి భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఇస్తాడు. 44 షోలతో కూడిన మ్యూజికల్ రీయూనియన్ టూర్.. అందులోనూ మూడు మిలియన్ డాలర్ల పారితోషికం! చర్చి అప్పులు తీర్చడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని ఐజాక్ భావిస్తాడు.
కానీ ఆ ఆఫర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరే. ఐజాక్ గతంలో కలిసి పనిచేసిన గాయని జువానిటా కూడా ఈ వ్యవహారంలో భాగమవుతుంది. ఐజాక్ విశ్వాసాన్ని దెబ్బతీసి, చర్చిని సొంతం చేసుకోవాలనేది మిస్టర్ లివ్డ్ అసలు ప్లాన్. ఇంతకీ అతడు ఎవరు? ఐజాక్ తన నమ్మకాన్ని వదులుకోకుండా చర్చిని ఎలా కాపాడుకున్నాడు? తన కుటుంబాన్ని, అక్కడి ప్రజలను ఎలా ఒక్కటి చేశాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా చివర్లో వచ్చే ఐజాక్ సంగీత ప్రదర్శన, దాని వెనుక ఉన్న ట్విస్ట్ సినిమాకు ప్రధాన హైలైట్. ఫ్యామిలీ ఎమోషన్స్, ఆధ్యాత్మిక సందేశం, సంగీతం కలిసిన పండుగ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
ఇందులో ఐజాక్ పాత్రలో ఆర్‌అండ్‌బీ సింగర్ డ్యురెల్ బాబ్స్ నటించగా, అతని భార్య రెబెక్కాగా ఫాంటాసియా బారినో టేలర్ కనిపించారు. ఫ్రెడ్ హమ్మండ్ అబ్రహం పాత్ర పోషించారు. టైలర్ పెర్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రముఖ గాస్పెల్ సంగీతకారుడు కిర్క్ ఫ్రాంక్లిన్ సంగీతాన్ని రూపొందించారు. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026 నవంబర్ 11 నుంచి Netflixలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి తెలుగులో చూసే ఛాన్స్ లేదు.