Korean Fantasy Comedy Series: ఒక ఆధునిక కాలానికి చెందిన మగాడి ఆత్మ వందల ఏళ్ల క్రితం జీవించిన ఒక రాణి శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? పైగా ఆ వ్యక్తికి వంట చేయడంలో మంచి ప్రావీణ్యం ఉండి, రాజభవనంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి పద్ధతులన్నింటినీ తనకు నచ్చినట్లు మార్చాలని చూస్తే ఇంకెంత రచ్చ జరుగుతుంది? ఇలాంటి విభిన్నమైన ఫాంటసీ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన కొరియన్ సూపర్‌హిట్ సిరీస్ ‘Mr. Queen’. 2020లో విడుదలైన ఈ హిస్టారికల్ రొమాంటిక్ కామెడీ కే-డ్రామా మొత్తం 20 ఎపిసోడ్‌లతో అభిమానులను ఇప్పటికీ తెగ ఆకట్టుకుంటోంది. ఫాంటసీ అండ్ అన్‌లిమిటెడ్ కామెడీని ఇష్టపడే వారు ఈ మాస్టర్ పీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు.
చాంగ్ బాంగ్-హ్వాన్ ఆధునిక కాలంలో దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బ్లూ హౌస్‌లో పనిచేసే ప్రతిభావంతుడైన చెఫ్. తన వంట నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే అతడికి కాస్త అహంకారం కూడా ఎక్కువే. ఒక అనుకోని ప్రమాదంలో స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన బాంగ్-హ్వాన్ కళ్లు తెరిచేసరికి జోసోన్ రాజవంశం కాలంలో ఉంటాడు. అయితే అక్కడ అతడి శరీరం ఉండదు. ఆ కాలానికి చెందిన కిమ్ సో-యోంగ్ అనే రాణి శరీరంలో అతడి ఆత్మ ప్రవేశిస్తుంది. తనకు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిన బాంగ్-హ్వాన్.. రాణి శరీరంలోనే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆధునిక కాలపు మగాడి ఆలోచనలు, అలవాట్లు ఉన్న అతడు రాజభవనంలోని సంప్రదాయాలు, కట్టుబాట్లకు అస్సలు సరిపోడు. దీంతో రాణి ప్రవర్తనలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు అక్కడి వారందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మరోవైపు రాజు చోల్‌జోంగ్ కూడా రాణి వింత ప్రవర్తనను గమనిస్తుంటాడు.
ఇక్కడితో కథ ఆగదు. రాజభవనంలో అధికారం కోసం జరిగే రాజకీయాలు, కుట్రలు, రహస్యాల మధ్య బాంగ్-హ్వాన్ చిక్కుకుంటాడు. తన ఆధునిక వంటల పరిజ్ఞానంతో రాజభవనంలోని వారిని ఆశ్చర్యపరుస్తూనే, తనకు తెలియకుండానే అక్కడి రాజకీయ వ్యవహారాల్లోనూ భాగమవుతాడు. ముఖ్యంగా రాణి సన్-వోన్, కిమ్ జ్వా-గన్ వంటి అధికార కేంద్రాల మధ్య జరిగే కుట్రలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. తిరిగి తన అసలు శరీరంలోకి ఎలా వెళ్లాలనే ఆలోచన ఒకవైపు ఉండగా, రాణిగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం మరోవైపు బాంగ్-హ్వాన్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో రాజు చోల్‌జోంగ్‌తో అతడికి ఏర్పడే అనుబంధం కూడా కథలో కీలకంగా మారుతుంది. రాణి శరీరంలో మగ చెఫ్ చేసే అల్లరి, రాజభవనంలోని రాజకీయాలు, ఊహించని రొమాంటిక్ మలుపులు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఫాంటసీ, హిస్టారికల్ డ్రామా, రొమాంటిక్ కామెడీ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
ఈ సిరీస్‌లో షిన్ హే-సన్ కిమ్ సో-యోంగ్‌గా, కిమ్ జంగ్-హ్యున్ రాజు చోల్‌జోంగ్‌గా నటించారు. బే జోంగ్-ఓక్, కిమ్ టే-వూ, సియోల్ ఇన్-ఆహ్, నా ఇన్-వూ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యూన్ సంగ్-షిక్, జాంగ్ యాంగ్-హో దర్శకత్వం వహించారు. 2020 డిసెంబర్ 11న ప్రారంభమైన ఈ సిరీస్ 2021 ఫిబ్రవరి 13తో ముగిసింది. మొత్తం 20 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం Amazon Prime Videoలో కొరియన్, తెలుగు, తమిళం, హిందీ ఆడియోల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి.
Read Also: తాతల నాటి రెస్టారెంట్ తెరవడానికి స్టార్ హీరోయిన్ పడ్డ పాట్లు… రియాలిటీ డాక్యుమెంటరీ