Suspense Thriller Series OTT: కాలేజీ హాస్టల్ జీవితం అనగానే అల్లరి, స్నేహాలు, అర్ధరాత్రి కబుర్లు గుర్తుకొస్తాయి. కానీ అదే హాస్టల్ లో వరుసగా అమ్మాయిలు మిస్సవుతుంటే, అదీ రాత్రిపూట గుర్రంపై ఒక తలలేని మొండెం తిరుగుతోందనే రూమర్లు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇదే పాయింట్‌తో ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంచలన వెబ్ సిరీస్ ‘హాస్టల్ హద్సా’ (Hostel Hadsa). ట్రైలర్ విడుదలైనప్పట్నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్, రిలీజ్ అయిన క్షణం నుంచి హారర్ లవర్స్‌ను కట్టిపడేస్తోంది. మరి హారర్ మూవీ లవర్స్ ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
షిమ్లాలోని పొగమంచుతో నిండిన ఓ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ హాస్టల్ నేపథ్యంలో సాగుతుంది కథ. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆశతో చేసిన ఓ చిన్న పని చివరకు భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. షిమ్లాలోని ఓ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్‌లో తిత్లీ అనే అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే కోరికతో ఆమె ఓ ప్లాన్ వేస్తుంది. తమ హాస్టల్‌లో దెయ్యం ఉందని అందరినీ నమ్మించేలా ఓ నకిలీ హారర్ వీడియోను రూపొందిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిత్లీ అనుకున్నట్లుగానే అందరి దృష్టి తనపై పడుతుంది. కానీ, ఆ సరదా ప్రాంక్ ఆమె ఊహించని మలుపు తీసుకుంటుంది. వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే తిత్లీ నిజంగానే హాస్టల్ నుంచి కనిపించకుండా పోతుంది. దీంతో అప్పటివరకు దెయ్యం కథను సరదాగా తీసుకున్న విద్యార్థినుల్లో భయం మొదలవుతుంది.
తిత్లీ అదృశ్యమైన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. మరోవైపు, దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయనే నమ్మకాన్ని అస్సలు అంగీకరించని ప్రియాల్ అనే యువతి ఈ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. మూఢనమ్మకాల కంటే ప్రతి ఘటన వెనుక ఓ కారణం ఉంటుందని నమ్మే ప్రియాల్, తిత్లీ మాయమవడానికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆమె దర్యాప్తు మొదలైన తర్వాత హాస్టల్‌లో పరిస్థితులు మరింత భయంకరంగా మారతాయి. ఒక్కొక్కరుగా అమ్మాయిలు కనిపించకుండా పోవడం, మరికొన్ని విషాదకర ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థినులంతా భయంతో వణికిపోతారు.
ఇంతలో అర్ధరాత్రి వేళ హాస్టల్ చుట్టూ ఉన్న దట్టమైన పొగమంచులో గుర్రంపై ఓ తలలేని ఆకారం కనిపిస్తోందనే విషయం కలకలం రేపుతుంది. ఆ ఆకారం నిజంగా దెయ్యమా ? లేక ఎవరో కావాలనే అందరినీ భయపెడుతున్నారా ? అనే అనుమానాలు మొదలవుతాయి. తిత్లీ చేసిన నకిలీ వీడియోకు, ఇప్పుడు జరుగుతున్న అదృశ్యాలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ప్రియాల్ ఆలోచిస్తుంది. దెయ్యాలని నమ్మని ప్రియాల్… తన కళ్లముందు జరుగుతున్న ఘటనలకు సమాధానం కనుగొనగలిగిందా ? తిత్లీ అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి ? గుర్రంపై కనిపించే తలలేని ఆకారానికి, హాస్టల్‌లో జరుగుతున్న మరణాలకు సంబంధమేంటి ? అనేది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
‘హాస్టల్ హాద్సా’ హిందీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అక్టోబర్ 28 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దీన్ని జీ5 వారి ‘ఫ్రీ 5’ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా చూసే అవకాశం ఉంది. దర్శకుడు సచిన్ గోటాడ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సుకృతి కాంద్‌పాల్ ప్రియాల్ పాత్రలో కనిపిస్తుంది. రచనా మిస్త్రీ, వినీత్ రైనా, సుష్మా కొల్హే, పూర్ణిమ డే, ప్రాజక్తా అవినాష్ వాడే తదితరులు కీలక పాత్రలు పోషించారు. బనిజయ్ ఆసియా నిర్మాణంలో వచ్చిన ఈ సిరీస్‌లో పొగమంచుతో నిండిన హిల్‌స్టేషన్ వాతావరణం, చీకటి హాస్టల్ కారిడార్లు, అర్ధరాత్రి గుర్రంపై కనిపించే భయంకరమైన ఆకారం వంటి అంశాలతో ఆడియన్స్ లో వణుకు పుట్టిస్తుంది.
Read Also: పిచ్చాసుపత్రి బేస్మెంట్లో సైకోపాత్… మిస్సైన అమ్మాయి కోసం వేట… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్