Classic Romantic Drama OTT: హాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో టామ్ క్రూజ్ ఒకరు. ఆయన కెరీర్‌లోని క్లాసిక్ రొమాంటిక్ డ్రామాల్లో ‘ఫార్ అండ్ అవే’ (Far and Away) కూడా ఒకటి. టామ్ క్రూజ్, నికోల్ కిడ్‌మన్ జంటగా నటించిన ఈ సినిమా 1992లో విడుదలైంది. ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీ ఓటీటీలోకి రావడంతో సినీ ప్రియులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశం దక్కింది. 19వ శతాబ్దపు నేపథ్యంలో సాగే ఈ కథలో పేదరికంలో మగ్గిపోతున్న ఓ యువకుడు, సంపన్న కుటుంబానికి చెందిన యువతి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేదే ఈ సినిమా ప్రధాన అంశం. మరి ఈ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ ? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
జోసెఫ్ డొన్నెల్లీ ఐర్లాండ్ లో పేదరికంతో పోరాడుతుంటాడు. తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలకు కారణమైన భూస్వామిపై కోపంతో ఉండే అతడు, జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉంటాడు. అదే సమయంలో సంపన్న భూస్వామి కుమార్తె షానన్ క్రిస్టీ కూడా తన కుటుంబం విధించిన హద్దుల్లో బతకడం ఇష్టం లేక, స్వతంత్రంగా జీవించాలని కలలు కంటుంది. ఒకరికి పేదరికం నుంచి బయటపడాలని ఉంటే, మరొకరికి తనకంటూ ఓ కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఉంటుంది. ఈ క్రమంలోనే జోసెఫ్, షానన్ పరిచయం ఏర్పడుతుంది. పరిస్థితుల కారణంగా ఇద్దరూ ఐర్లాండ్‌ను విడిచిపెట్టి అమెరికాకు ప్రయాణమవుతారు. అక్కడ తమకంటూ సొంత భూమిని సంపాదించుకోవచ్చనే ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది.
అయితే అమెరికాకు చేరుకున్నంత మాత్రాన వారి కష్టాలు తీరిపోవు. బోస్టన్ లో జీవనం సాగించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తినడానికి తిండి, ఉండటానికి చోటు కోసం కష్టపడతారు. జోసెఫ్ బాక్సింగ్ లోకి అడుగు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ కూడా ఎదురుదెబ్బలు తప్పవు. ఒక కీలకమైన పోటీలో ఓడిపోవడంతో ఇద్దరూ మరింత కష్టాల్లో పడతారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జోసెఫ్, షానన్ మధ్య ప్రేమ బలపడుతుంది. మొదట తమ తమ కలలను నెరవేర్చుకోవడానికి కలిసి ప్రయాణం మొదలుపెట్టిన వీరిద్దరూ, క్రమంగా ఒకరికొకరు అండగా నిలవడం నేర్చుకుంటారు. చివరికి ఓక్లహోమాలో భూమిని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో జోసెఫ్ ప్రయాణం కొనసాగిస్తాడు. మరి తమ కలల కోసం మొదలుపెట్టిన ప్రయాణంలో ఈ జంట అనుకున్నది సాధించిందా ? అన్ని కష్టాల మధ్య వారి ప్రేమ నిలబడిందా ? అనేది సినిమాలో చూడాల్సిందే.
‘ఫార్ అండ్ అవే’ 1992లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ సినిమాను ఆపిల్ టీవీ (Apple TV Store), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ద్వారా అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఈ చిత్రానికి రాన్ హోవార్డ్ (Ron Howard) దర్శకత్వం వహించారు. జోసెఫ్ పాత్రలో టామ్ క్రూజ్ (Tom Cruise), షానన్ పాత్రలో నికోల్ కిడ్‌మన్ (Nicole Kidman) నటించారు. ప్రేమకథతో పాటు వలస జీవితం, పేదరికం, స్వంత భూమిని సంపాదించుకోవాలనే కల వంటి అంశాలు సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
Read Also: రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో