Psychological Crime Thriller: థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌లను ఇష్టపడే పిచ్చి అభిమానుల కోసం యాపిల్ టీవీ ప్లస్ మరో అద్భుతమైన సరుకుతో వస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘నాక్టర్న్’ (Nocturne) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓటీటీ మూవీ లవర్స్ కి నిద్రలేకుండా చేస్తోంది. ఒక పాత, భయానకమైన పిచ్చాసుపత్రి బేస్‌మెంట్ లో బందీగా ఉన్న డేంజరస్ సైకోపాత్, అంతుచిక్కని రీతిలో మిస్సైన కాలేజీ అమ్మాయి… ఈ రెండింటి చుట్టూ తిరిగే కథ నరాలు తెగే ఉత్కంఠను రేపుతుంది. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది ? ఆ సైకోపాత్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఎపిసోడ్ ఎపిసోడ్‌కి క్యూరియాసిటీని విపరీతంగా పెంచేస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
జోనా లిన్ మాజీ సైనికుడు. ఆ తర్వాత హత్యల కేసులను దర్యాప్తు చేసే పోలీస్ అధికారిగా మారతాడు. ఫిలడెల్ఫియా నగరంలో నేరాలు, హింస మధ్య పనిచేసి అలసిపోయిన జోనా… తన కుటుంబంతో కలిసి పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఓ చిన్న పట్టణానికి వెళ్లి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. కానీ అతడు ఆశించిన ప్రశాంతత ఎక్కువకాలం ఉండదు. ఆ పట్టణంతో పాటు అతడి కుటుంబం కూడా ఓ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ కారణంగా ముప్పులో పడుతుంది.
ఆ హంతకుడి పేరు జురెక్ వాల్టర్. అతడి ఆలోచనలు, నేరాలు భయంకరంగా ఉంటాయి. అతడిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఎందుకంటే, జురెక్ కేవలం హత్యలు చేసే వ్యక్తి మాత్రమే కాదు… తన తెలివితేటలతో ఎదుటి వాళ్లను మెంటల్ గా మానిప్యులేట్ చేస్తాడు. ప్రస్తుతం అతను ఓ మెంటల్ హాస్పిటల్ బేస్మెంట్ జైలులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే గతంలో అతడి నేరాలకు సంబంధించిన ఓ బాధితురాలు అనూహ్యంగా తిరిగి కనిపించడంతో కేసు మలుపు తిరుగుతుంది. ఆ బాధితురాలు ఎవరో కాదు… సైకో కిడ్నాప్ చేసిన ఇద్దరిలో ఒకరు. అయితే ఇంకో వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారుతుంది.
ఆ మిస్సైన వ్యక్తి ఎక్కడుందో తెలుసుకోవడానికి జోనా తనకు అత్యంత సన్నిహితురాలైన సాగా బాయర్ సహాయం తీసుకుంటాడు. సాగా ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్. కేసులోని నిజాన్ని బయట పెట్టాలంటే జురెక్ కు దగ్గరవ్వడం తప్ప మరో మార్గం లేదని భావిస్తుంది. దీంతో అతడి దగ్గరికి వెళ్లి, అతడి మనసులో దాగిన విషయాలను తెలుసుకునేందుకు అండర్‌కవర్ ఆపరేషన్ మొదలుపెడుతుంది. అయితే, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మరోవైపు జోనా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే, జురెక్ నుంచి మిగతా బాధితులకు ప్రమాదం జరగకుండా చూడాలి. సాగా మాత్రం హంతకుడి నుంచి సమాచారం రాబట్టే క్రమంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది. అసలు జురెక్ దగ్గర నుంచి నిజం బయటపడుతుందా ? మిస్సైన వ్యక్తి ఆచూకీ దొరుకుతుందా ? ఈ దర్యాప్తు జోనా కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెడుతుంది ? అనే అంశాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
‘నాక్టర్న్’ అక్టోబర్ 30 నుంచి యాపిల్ టీవీ ప్లస్ (Apple TV+)లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్. ఈ సిరీస్‌లో లివ్ ష్రైబర్ (Liev Schreiber) జోనా లిన్‌గా, జాజీ బీట్స్ (Zazie Beetz) సాగా బాయర్‌గా, స్టీఫెన్ గ్రాహమ్ (Stephen Graham) జురెక్ వాల్టర్‌గా నటించారు. లార్స్ కెప్లర్ (Lars Kepler) రాసిన క్రైమ్ నవలల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. పది ఎపిసోడ్‌లతో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మొదటి రెండు ఎపిసోడ్‌లు అక్టోబర్ 30న విడుదలవుతాయి. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఒక్కో కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.