Baththa OTT: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఎలాంటి పాత్ర చేసినా తన సహజ నటనతో ప్రాణం పోస్తారనే సంగతి తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బత్తా’ (Baththa) ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదలై నవ్వుల పువ్వులు పూయిస్తోంది. టైటిల్ వినగానే ఏదో సీరియస్ సినిమా అనుకుంటే పొరబడినట్టే… ఇదొక కంప్లీట్ మాస్, క్లాస్ మిక్స్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్. ఒక స్కూల్ టాయిలెట్ లో ఒక చిన్న కుర్రాడు అనుకోకుండా ఒక గ్యాంగ్‌స్టర్ ను బంధిస్తే ఎలాంటి రచ్చ జరుగుతుందో ఇందులో చూడవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్న వివరాల్లోకి వెళ్తే…
1986 నాటి మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బత్తా అలియాస్ బత్తావచలం ఆ ప్రాంతంలో తిరుగులేని లోకల్ గ్యాంగ్‌స్టర్. దందాలు చేయడం, ప్రత్యర్థులతో గొడవలు పడటం, తనను ఎదిరించిన వాళ్లను భయపెట్టడం అతడికి అలవాటు. జనాలు తనను చూస్తే వణికిపోవాలని కోరుకునే బత్తాకు ఆ భయమే ఓ రకమైన గర్వం. ఇంట్లోనూ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భార్య కన్నిమతో కోపంగా, కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఇక బత్తా ఇంటి టెర్రస్‌పై సింహం బోన్ ఉందని, అతడు సింహాన్ని పెంచుకుంటున్నాడని ఆ ప్రాంతంలో రకరకాల కథలు ప్రచారంలో ఉంటాయి.
మరోవైపు శబరి అనే ఎనిమిదేళ్ల స్కూల్ విద్యార్థి ఉంటాడు. చాలా అమాయకంగా, పిరికిగా ఉండే శబరికి బత్తా అంటే విపరీతమైన భయం. అతడి గురించి విన్న భయంకరమైన కథలతో బత్తా ఎదురుపడితే ఏం జరుగుతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడు. అలాంటి శబరికి ఓ రోజు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. స్కూల్ సమీపంలో తన అనుచరులతో కలిసి ప్రత్యర్థులతో గొడవపడిన బత్తా, ఆ తర్వాత ఎవరూ పెద్దగా ఉపయోగించని పాడుబడిన స్కూల్ బాత్రూమ్‌లోకి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శబరి… లోపల ఉన్నది తనను భయపెట్టే గ్యాంగ్‌స్టర్ అని గుర్తిస్తాడు. భయంతో ఏం చేయాలో అర్థంకాని ఆ చిన్నోడు, బత్తా తనకేదైనా హాని చేస్తాడేమోనని భావించి బయట నుంచి తలుపుకు గడియ పెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు.
మొదట్లో బత్తా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. తన అనుచరులు వచ్చి తలుపు తీస్తారని అనుకుంటాడు. కానీ అది పాడుబడిన బాత్రూమ్ కావడంతో అతడిని వెతుక్కుంటూ ఎవరూ రారు. అలా బయట ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న గ్యాంగ్‌స్టర్… ఓ చిన్న కాంక్రీట్ గదిలో బందీగా ఉండిపోతాడు. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఎనిమిది రోజుల పాటు అక్కడే చిక్కుకుపోతాడు. ఆకలి, దాహం, ఒంటరితనం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఎనిమిది రోజుల తర్వాత బత్తా బయటకు ఎలా వస్తాడు ? తనను బంధించింది శబరేనని తెలిసిన తర్వాత ఆ చిన్నోడిపై పగ తీర్చుకుంటాడా ? లేక అతడితో ఏర్పడిన అనుబంధం బత్తాను కొత్త మనిషిగా మారుస్తుందా ? అనేదే కథలో కీలకమైన మలుపు.
‘బత్తా’ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బత్తవాచలం పాత్రలో నటించగా, మాస్టర్ సాయి పృథ్వీరాజ్ (Master Sai Prithviraj) శబరిగా కనిపిస్తాడు. లిజోమోల్ జోస్ (Lijomol Jose) కన్నిమ పాత్రలో నటించింది. వీరితో పాటు బేబీ సహస్ర శ్రీ (Baby Sahasra Sree), శాంతి బాలచంద్రన్ (Santhy Balachandran), హరి కృష్ణన్ (Hari Krishnan), అర్జున్ చిదంబరం (Arjun Chidambaram), అజయ్ ఘోష్ (Ajay Ghosh) తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు బాలాజీ తరణీతరన్ (Balaji Tharaneetharan) దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమాలలో ఇది కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. వీకెండ్‌లో టెన్షన్లన్నీ పక్కన పెట్టి కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ మెడిసిన్ లాంటిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉన్న ఈ సినిమాను తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నవ్వుల జాతరను వెంటనే చూసేయండి.
Read Also: స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్