OTT Movie : రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వీల్లేకుండా, బద్దలు కొట్టలేని గోడలు ఊడిపడితే ఏంటి పరిస్థితి? ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఇదే స్టోరీ లైన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను అల్లేశాడు ఓ డైరెక్టర్. ఇలాంటి వింత ఆలోచనలతో సినిమాలు చేసే హాలీవుడ్ మేకర్స్ మాత్రమే. కాబట్టి ఇదొక హాలీవుడ్ మూవీ. కానీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘బ్రిక్’ (Brick). 2025లోనే విడుదలైన జర్మన్ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్. ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ను రహస్యమైన బ్లాక్ బ్రిక్ వాల్ ఆవరించడం అనే అంశంతో, సైన్స్-ఫిక్షన్, డ్రామా, సస్పెన్స్ జానర్‌లను మిళితం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాగా 2025 జూలై 10న విడుదలైంది. ఈ చిత్రంలో మాటియాస్ ష్వీగోఫర్ (టిమ్), రూబీ ఓ. ఫీ (ఒలివియా), ఫ్రెడరిక్ లావు (మార్విన్), సల్బర్ లీ విలియమ్స్ (అనా), మురాతన్ ముస్లు (యూరి), ఆక్సెల్ వెర్నర్, సిరా-అన్నా ఫాల్ నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్ లలోస్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది, రన్‌టైమ్ 1 గంట 39 నిమిషాలు ఉన్న ఈ మూవీకి ఫిలిప్ కోచ్ దర్శకత్వం వహించగా, రాట్ ప్యాక్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.
కథలోకి వెళ్తే…
బ్రిక్ కథ టిమ్ (మాటియాస్ ష్వీగోఫర్), ఒలివియా (రూబీ ఓ. ఫీ) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఈ దంపతులు ఇద్దరూ డిప్రెషన్ లో ఉన్నారు. ప్రెగ్నెంట్ అని తెలిసి ఇద్దరూ తెగ సంతోషపడతారు. కానీ అంతలోనే అబార్షన్ కావడం వల్ల, ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఒకే ఇంట్లోనే ఉంటూనే ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. ఎదురు పడితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా ఉంటుంది. ఇలాగే ఓరోజు రాత్రి హీరోయిన్ హీరోను ఆ డిప్రెషన్ లో నుంచి బయట పడేయాలనే ఆలోచనతో ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ హీరో మాత్రం అందుకు రెడీగా ఉండకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో హీరోయిన్ అతన్ని వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది.
Read Also : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేసే హీరో… ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్
నెక్స్ట్ డే ఉదయం ఇద్దరూ మేల్కొన్నప్పుడు, వారి అపార్ట్‌మెంట్ బిల్డింగ్ రహస్యమైన, కూలగొట్టడం సాధ్యంకాని బ్లాక్ బ్రిక్ వాల్‌తో కవర్ అయ్యి ఉంటుంది. కనీసం కిటికీలు కూడా ఓపెన్ కాని పరిస్థితి. దీని వల్ల బయటకు వెళ్లే మార్గం కాదు కదా… కనీసం ఫోన్ సిగ్నల్, నీరు, లేదా బయటి సహాయం కూడా ఉండదు. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ గోడలను కూలగొడుతూ ఈ జంట… తమ పొరుగువారైన మార్విన్ (ఫ్రెడరిక్ లావు), అనా (సల్బర్ లీ విలియమ్స్), ఒక వృద్ధుడు, అతని మనవరాలు (ఆక్సెల్ వెర్నర్, సిరా-అన్నా ఫాల్), యూరి (మురాతన్ ముస్లు) అనే కాన్స్‌పిరసీ థియరిస్ట్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుంటారు. అందరూ కలిసి అక్కడి నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తారు. అసలు ఈ వాల్ అక్కడికి ఎలా, ఎందుకు వచ్చింది? ఇది మనుషుల పనేనా? లేక ఏలియన్స్ చేసిన పనా ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.