Horror Thriller on OTT: పాత ఇంట్లో దొరికిన ఒక వింత విగ్రహం… దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భర్త ప్రవర్తనలో ఊహించని మార్పులు… చివరికి అతని కళ్లు పసుపు రంగులోకి మారితే? ఇదేదో సాధారణ దెయ్యం కథ అనుకుంటే పొరబడినట్టే. మనిషిలో దాగి ఉన్న చెడు కోరికలు, వ్యసనాలను ఆయుధాలుగా మార్చుకుని అతన్ని తన వశంలోకి తెచ్చుకునే ఒక దుష్టశక్తి చుట్టూ తిరిగే కథ ‘యెల్లో ఐస్’ (Yellow Eyes). భర్తను కాపాడుకోవడానికి ఓ భార్య చేసే పోరాటమే ఈ హారర్ థ్రిల్లర్‌లో అసలైన ఆసక్తికరమైన అంశం. మరి ఆ ఇంట్లో దొరికిన విగ్రహం ఏంటి? బ్రాడ్‌లో వచ్చిన మార్పుకు కారణమేంటి? చివరికి జూలియా తన భర్తను కాపాడుకోగలిగిందా? ఏ ఓటీటీలో ఉంది ఈ సినిమా ? అనేది తెలుసుకుందాం.
బ్రాడ్, జూలియా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బ్రాడ్‌కు చనిపోయిన బాబాయ్‌కి చెందిన ఓ పాత ఇల్లు వారసత్వంగా వస్తుంది. ఇల్లు చాలా కాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థలో ఉంటుంది. ఇద్దరూ అక్కడికి వెళ్లి ఇంటిని శుభ్రం చేస్తుండగా గోడల వెనుక దాచిన ఓ విచిత్రమైన పురాతన విగ్రహం బయట పడుతుంది.
బ్రాడ్‌కు అది సాధారణ వస్తువులా అనిపించదు. చాలా పురాతనంగా, విలువైనదిగా కనిపించడంతో దాన్ని ఇంట్లోనే ఉంచుకుంటాడు. కానీ అదే వాళ్ల జీవితాల్లో అసలు సమస్యకు కారణమవుతుంది. విగ్రహాన్ని తాకిన తర్వాత బ్రాడ్ ప్రవర్తనలో నెమ్మదిగా మార్పులు మొదలవుతాయి. అతని మాట తీరు, కోపం, ఆలోచనా విధానం అన్నీ మారిపోతుంటాయి. మొదట జూలియా దీన్ని ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం ప్రభావంగా భావిస్తుంది.
కొద్దిరోజులకు పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. బ్రాడ్ కళ్లు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఇంట్లో ఎక్కడ చూసినా నల్లటి జిగట ద్రవం కనిపిస్తుంది. బ్రాడ్ తన నియంత్రణలో తాను లేడని జూలియాకు అర్థమవుతుంది. అసలు ఆ విగ్రహం వెనుక ఏదో దుష్టశక్తి ఉందని ఆమె అనుమానిస్తుంది. ఆ శక్తి మనిషిలోని బలహీనతలను, చెడు కోరికలను ఆసరాగా చేసుకుని అతన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జూలియా తెలుసుకుంటుంది. అప్పటికే బ్రాడ్ పూర్తిగా దాని ప్రభావంలోకి వెళ్లిపోతాడు. భార్యను కూడా భయపెట్టేంత క్రూరంగా మారిపోతాడు.
బ్రాడ్‌ను అలా వదిలేయడానికి ఇష్టపడని జూలియా సహాయం కోసం వెతుకుతుంది. విగ్రహం వెనుక ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవడంతో పాటు, దాని ప్రభావం నుంచి భర్తను బయటకు తీసుకురావడానికి భూతవైద్యుడి సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ అప్పటికే ఆ దుష్టశక్తి మరింత బలపడుతుంది. చివర్లో జూలియా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రాడ్‌ను ఆ శక్తి నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవైపు భర్తను కోల్పోతాననే భయం, మరోవైపు ఆ ఇంట్లో పెరుగుతున్న అతీంద్రియ ప్రమాదం… ఈ రెండింటి మధ్య ఆమె చేసే పోరాటమే క్లైమాక్స్. చివరకు ఆ శాపాన్ని ఆపగలిగిందా? బ్రాడ్ తిరిగి మామూలు మనిషిగా మారాడా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
‘యెల్లో ఐస్’ ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. సినిమా ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోలోనే ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఓసారి ఈ సినిమాను ట్రై చేయొచ్చు.