Crime Comedy Movie: స్నేహితుడి పెళ్లి అంటే సాధారణంగా ఫ్రెండ్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ పెళ్లే జరగకుండా చేయాలని స్నేహితులంతా ఒక్కటైతే పరిస్థితి ఎలా ఉంటుంది? అందులోనూ ఆ పెళ్లి జరుగుతున్న సమయంలోనే ఓ భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడితే.. అటు పెళ్లి సందడి, ఇటు పోలీసుల హడావుడి మధ్య జరిగే గందరగోళం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి క్రేజీ కామెడీ, క్రైమ్ అంశాలను కలిపి తెరకెక్కించిన హాలీవుడ్ మూవీనే ‘సూపర్ ట్రూపర్స్ 3’ (Super Troopers 3). హాలీవుడ్‌లో స్లాప్‌స్టిక్ కామెడీ అండ్ క్రైమ్ మిక్స్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ‘సూపర్ ట్రూపర్స్’ ఫ్రాంచైజీ. Broken Lizard కామెడీ టీమ్ తిరిగి తమదైన స్టైల్‌లో ప్రేక్షకులను నవ్వించేందుకు పార్ట్ 3 తో మరోసారి ముందుకొచ్చింది. 2026లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటి? దీనిని ఎక్కడ చూడచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈసారి సూపర్ ట్రూపర్స్ టీమ్‌లోని ఫార్వా (Farva) జీవితంలో ఓ కొత్త మలుపు ఎదురవుతుంది. అతను థోర్నీ (Thorny) సోదరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే ఈ సంబంధం థోర్నీకి ఏమాత్రం నచ్చదు. తన సోదరి ఫార్వాను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేకపోవడంతో ఎలాగైనా ఈ ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో స్నేహితుల మధ్య అసలు రచ్చ మొదలవుతుంది. ఫార్వా పెళ్లి ప్రయత్నాలు ఒకవైపు సాగుతుంటే, థోర్నీ మాత్రం ఆ సంబంధాన్ని చెడగొట్టేందుకు తనదైన ప్లాన్స్ వేస్తుంటాడు. ఈ క్రమంలో మిగతా సూపర్ ట్రూపర్స్ కూడా ఈ వ్యవహారంలో భాగమవుతారు. ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు, పిచ్చి పనులు, ఊహించని ప్రాంక్స్‌తో కథ ఆద్యంతం సరదాగా సాగుతుంది.
అయితే ఇదంతా కేవలం పెళ్లి చుట్టూ తిరిగే కామెడీ అనుకుంటే పొరబడినట్లే. అదే సమయంలో ఈ పోలీస్ టీమ్‌కు ఓ కొత్త క్రైమ్ కేసు ఎదురవుతుంది. ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ నడుస్తున్నట్లు బయటపడుతుంది. దీంతో పెళ్లి వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఫార్వా ఎంగేజ్‌మెంట్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి.. మరోవైపు డ్రగ్స్ ముఠాను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులపై పడుతుంది. ఈ రెండు వ్యవహారాల మధ్య సూపర్ ట్రూపర్స్ చేసే హంగామానే సినిమాలో అసలైన హైలైట్. ముఖ్యంగా థోర్నీ తన స్నేహితుడి సంబంధాన్ని చెడగొట్టేందుకు చేసే ప్రయత్నాలు, అదే సమయంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఎదురయ్యే గందరగోళం నవ్వులు పూయిస్తాయి. సీరియస్‌గా సాగాల్సిన పోలీస్ ఆపరేషన్ కూడా వీరి చేతుల్లో కామెడీగా మారిపోతుంది.
ఈ సినిమాలో జే చంద్రశేఖర్ (Jay Chandrasekhar) థోర్నీగా, కెవిన్ హెఫెర్నన్ (Kevin Heffernan) ఫార్వాగా, స్టీవ్ లెమ్మే (Steve Lemme) మాక్‌గా, పాల్ సోటర్ (Paul Soter) ఫోస్టర్‌గా, ఎరిక్ స్టోల్హాన్స్కే (Erik Stolhanske) రాబిట్‌గా నటించారు. జే చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను Broken Lizard టీమ్ రచించింది. రిచ్ పెరెల్లో నిర్మించారు. ఈ మూవీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కాగా, నవంబర్ 5 నుంచి Huluలో స్ట్రీమింగ్ అవుతోంది.