Japanese Anime Series: వర్చువల్ రియాలిటీ గేమింగ్, డెత్ గేమ్ కాన్సెప్ట్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిమే సిరీస్ ‘Sword Art Online’. ఈ ఫ్రాంచైజీని సృష్టించిన రెక్కి కవహారా మరోసారి అలాంటి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘Devils’ Crest’. జపనీస్‌లో ‘Demons’ Crest’ పేరుతో ఉన్న ఈ నవల ఆధారంగా రూపొందిన ఈ యానిమే సిరీస్‌ను ప్రముఖ స్టూడియో Production I.G నిర్మించింది. మిక్స్‌డ్ రియాలిటీ, ఫుల్ డైవ్ వీఆర్ గేమింగ్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 6 నుంచి Amazon Prime Video లో ఇంటర్నేషనల్ వైడ్‌గా నంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం మొదటి రెండు ఎపిసోడ్‌లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి. ఈ సిరీస్‌కు ప్రముఖ జపనీస్ సింగర్ Ado పాడిన ‘Shinka’ ఓపెనింగ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ డార్క్ యానిమే కథేంటో తెలుసుకుందాం పదండి.
కథ 2031 సంవత్సరంలో జరుగుతుంది. యుకిహానా ఎలిమెంటరీ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న యూమా ఆషిహారా, అతడి కవల సోదరి సావా ఆషిహారా తమ క్లాస్‌మేట్స్‌తో కలిసి ప్రపంచంలోనే తొలి ఫుల్ డైవ్ VRMMORPG గేమ్ ‘Actual Magic’ను పరీక్షించే అవకాశం పొందుతారు. ఈ గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆటగాళ్లు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోకి వెళ్లి, అక్కడి అనుభవాలను నిజంగా అనుభూతి చెందగలరు.
యూమా, సావా తమ స్నేహితులు కెంజి కొండో, మినాగి సానోతో కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి గేమ్‌లోని డంజియన్‌లోకి వెళ్తారు. అక్కడ ఎదురయ్యే శక్తివంతమైన బాస్‌తో పోరాడి చివరకు విజయం సాధిస్తారు. ఇక గేమ్ నుంచి లాగ్ అవుట్ అయి బయటకు రావడమే మిగిలిందనుకునే సమయంలో అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. గేమ్ నుంచి బయటకు వచ్చే మార్గమే కనిపించదు. అంతేకాదు, కాసేపటికే యూమా కళ్లు తెరిచి చూసేసరికి గేమ్ ప్రపంచం, నిజ జీవిత ప్రపంచం రెండూ కలిసిపోయినట్లు తెలుస్తుంది.
ఇక్కడి నుంచే అసలైన ప్రమాదం మొదలవుతుంది. అప్పటివరకు గేమ్‌లో మాత్రమే కనిపించిన రాక్షస రూపాలు నిజ జీవితంలోనూ ప్రత్యక్షమవుతాయి. యూమా క్లాస్‌మేట్ సుమికా వాటమాకి కూడా భయంకరమైన రాక్షస రూపంలోకి మారి అతడిపై దాడి చేస్తుంది. మరోవైపు సావా తన గేమ్‌లోని మ్యాజిక్ శక్తులను నిజ జీవితంలోనూ ఉపయోగించగలుగుతుంది. అసలు గేమ్‌లోని క్యారెక్టర్ స్టేటస్‌లు, మ్యాజిక్ పవర్స్ నిజ ప్రపంచంలోకి ఎలా వచ్చాయి? ఈ మార్పు వెనుక కారణమేంటి? అన్నది యూమాకు అంతుచిక్కని ప్రశ్నగా మారుతుంది.
తన స్నేహితులపై దాడి చేస్తున్న రాక్షసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా, వాళ్లు కూడా తన క్లాస్‌మేట్సే కావడంతో యూమా వారిని చంపకుండా కాపాడాలని ప్రయత్నిస్తాడు. ఒకవైపు ప్రాణాలకు ముప్పు, మరోవైపు తన వాళ్లను రక్షించుకోవాలనే బాధ్యత మధ్య అతడు చేసే పోరాటమే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. వర్చువల్ గేమ్‌లోని ప్రమాదాలు నిజ జీవితంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచనతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
రెక్కి కవహారా రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ యానిమేకు షింజి ఉషిరో జనరల్ డైరెక్టర్‌గా, కెంజిరో కొమయా దర్శకుడిగా వ్యవహరించారు. Production I.G యానిమేషన్ దీనిని నిర్మించింది. యూమా పాత్రకు హరుకా షిరైషి, సావా పాత్రకు కొనోమి ఇనగాకి, కెంజి పాత్రకు యుయా హిరోసే, మినాగి పాత్రకు సతోమి అమనో వాయిస్ అందించారు. నవంబర్ 6 నుంచి Amazon Prime Videoలో మొదటి రెండు ఎపిసోడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ యానిమే సిరీస్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు హిందీ, థాయ్ ఆడియో డబ్బింగ్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది. తెలుగు ఆడియో వెర్షన్ మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.