Supernatural Horror Thriller: ఇండియన్ ఫోక్ లోర్ (జానపద కథలు), పురాతన మైథాలజీని మిక్స్ చేసి తీసే సూపర్ నేచురల్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది. ‘కాంతార’, ‘తుంబాడ్’ శైలిలో బిహార్ లోని వనదేవి ఆలయ చారిత్రక కథల ఆధారంగా బాలీవుడ్ మేకర్ దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కించిన లేటెస్ట్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘The Vvaan: Force of the Forrest’. థియేటర్లలో విజువల్ వండర్ లా రచ్చ చేసిన ఈ చిత్రం, నవంబర్ 6 నుండి ఓటీటీలోకి అఫీషియల్ గా ల్యాండ్ అయిపోయింది. బిహార్‌లోని బిహ్తా ప్రాంతానికి సమీపంలో ఉన్న సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన వనదేవి ఆలయం, అక్కడి స్థానిక జానపద నమ్మకాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అడవి, దేవత, ఫోక్‌లోర్ హారర్, మిస్టరీ, ఫాంటసీ అంశాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ సజేషన్. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
రిషి (సిద్ధార్థ్ మల్హోత్రా) ముంబైలో పనిచేసే ఒక పీడబ్ల్యూడీ (PWD) సూపర్‌వైజర్. తన భార్య మమత (తమన్నా భాటియా)తో కలిసి ఛత్ పూజ వేడుకల సమయంలో బిహార్‌లోని తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మేయాలనేది అతడి ఆలోచన. అయితే ఆ గ్రామానికి సమీపంలో ఉన్న దేవ్ వన్ అనే దట్టమైన అడవి అతడి ప్రణాళికలకు అడ్డంకిగా మారుతుంది. ఆ అడవిని గ్రామస్తులు సాధారణ అటవీ ప్రాంతంగా చూడరు. వనదేవి నివాసంగా భావించే ఆ ప్రాంతంలో సూర్యాస్తమయం తర్వాత అడుగుపెట్టడానికి కూడా భయపడతారు. తరతరాలుగా వస్తున్న ఆ నమ్మకాల ప్రకారం, చీకటి పడిన తర్వాత అడవిలోకి వెళ్లడం ప్రమాదకరం. కానీ రిషి మాత్రం ఇలాంటి నమ్మకాలను మూఢనమ్మకాలుగానే భావిస్తాడు. తనకు కనిపించని శక్తుల గురించి గ్రామస్తులు చెప్పే కథలను అతడు పెద్దగా పట్టించుకోడు.
ఇదిలా ఉంటే, స్థానికంగా పలుకుబడి ఉన్న దీపక్ (సునీల్ గ్రోవర్) ఆ పవిత్రమైన అడవి గుండా రహదారి నిర్మాణం చేపట్టాలని చూస్తుంటాడు. ఈ ప్రాజెక్టు కోసం అడవిని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామంలో కొందరు దీనికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వనదేవి ఆగ్రహానికి గురవుతామని హెచ్చరిస్తుంటారు. ఈ వ్యవహారంలో రిషి కూడా చిక్కుకుంటాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. రిషి తన పూర్వీకుల గ్రామానికి వచ్చిన తర్వాత దేవ్ వన్ అడవిలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతుంది. అక్కడి జానపద కథల్లో చెప్పుకునే వనదేవి నిజంగానే ఉందా? ఒకప్పుడు ఆ అడవిలోకి వెళ్లిన వారికి ఏం జరిగింది? రహదారి నిర్మాణం పేరుతో అడవిని నాశనం చేయాలనుకుంటున్న వారి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న రిషికి ఎదురయ్యే అతీంద్రియ అనుభవాలే కథలో ఉత్కంఠను పెంచుతాయి.
ఈ సినిమాలో రిషి పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించగా, అతడి భార్య మమతగా తమన్నా భాటియా కనిపించారు. సునీల్ గ్రోవర్ దీపక్ పాత్రలో, అనుప్ సోని శశి భయ్యాగా, శ్వేతా తివారీ సుశీలగా నటించారు. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్, అరుణాభ్ కుమార్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా సుమారు 2 గంటల 16 నిమిషాల నిడివితో ఉంటుంది. 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నవంబర్ 6 నుంచి Amazon Prime Videoలో రెంట్‌కు అందుబాటులోకి వచ్చింది. Prime Videoలో ప్రస్తుతం హిందీ ఆడియో, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో సబ్‌టైటిల్స్ ఉన్నాయి.
Read Also: విమాన ప్రమాదం… మంచు అరణ్యంలో ఒంటరి పోరాటం… కదిలించే సర్వైవల్ థ్రిల్లర్