Thai Comedy Movie: మన కమర్షియల్ సినిమాల్లో హీరో ఎలివేషన్లు, గాల్లోకి ఎగిరే ఫైట్లు, ఒక దెబ్బకు పదిమంది విలన్లు ఎగిరిపడటం, సెంటిమెంట్ కోసం చేసే భారీ హంగామా.. ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమాలో తండ్రి కోసం కొడుకు సృష్టించే నకిలీ ప్రపంచం కథకు మంచి గుర్తింపు ఉంది. దూకుడు సినిమాలో తండ్రి కోసం పొలిటిషన్ అయినట్లు హీరో నటిస్తాడు. ఇప్పుడు అలాంటి ఫాదర్ సెంటిమెంట్, ఫేక్ పోలీస్ డ్రామా కాన్సెప్ట్‌ను బాలీవుడ్ తరహా భారీ యాక్షన్, కామెడీతో కలిపి థాయ్ మేకర్స్ రూపొందించిన సినిమానే ‘ఓవరాక్టింగ్’ (Overacting). ఇందులో తండ్రి కోసం కూతురు పోలీస్ స్టేషన్ సెట్ అప్ సెట్ చేస్తుంది. ఈ నకిలీ కాన్సెప్ట్ చూసినప్పుడు మనకు ‘దూకుడు’ గుర్తుకు వస్తుంది. ప్రూక్సా అమరుజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కడుపుబ్బ నవ్వి స్తోంది. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ చిత్రంలో కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రిటైర్ అయిన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్‌కు వయసురీత్యా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అయితే, తను ఇంకా డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గానే పనిచేస్తున్నానని ఆయన గట్టిగా నమ్ముతుంటాడు. ఆ వయసులో ఆయనకు కలిగే ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, ఆయనను సంతోషపెట్టడానికి కూతురు (ఓ స్ట్రగులింగ్ నటి) ఒక విచిత్రమైన ప్లాన్ వేస్తుంది. తన స్నేహితులతో కలిసి ఇంట్లోనే ఒక నకిలీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, ఆయన కళ్లముందు రకరకాల డ్రామాలు ఆడిస్తుంటుంది.
ఈ క్రమంలో వాళ్లు చేసే హడావుడి, ఇండియన్ కమర్షియల్ సినిమాల స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ నడిపించే తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమాలో వచ్చే ప్రతి సీన్ మనకు ఎన్నో సౌత్ ఇండియన్, బాలీవుడ్ మాస్ సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ సీన్ల పేరిట చేసే హంగామాకు థాయ్ మేకర్స్ ఇచ్చిన సెటైర్లు నవ్వులు పూయిస్తాయి.
వారమంతా పడిన పని టెన్షన్స్‌ను పక్కన పెట్టి, ఈ వీకెండ్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవాళ్లకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. లాజిక్‌లను పూర్తిగా పక్కన పెట్టి చూస్తే.. ‘ఓవరాక్టింగ్’ మంచి టైమ్‌పాస్ మూవీగా నిలుస్తుంది. మరి మీరు ఈ థాయ్ సెటైరికల్ కామెడీని చూసేసారా? చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం, ఓటీటీలో ఇప్పుడే చూసేయండి.
ఈ సినిమాలో వినై పాత్రలో తెంగ్ తెర్డ్ తెంగ్, అతడి కూతురు వోరానుచ్‌గా బౌ మయ్లాడా సుస్రి, సార్జెంట్ టాయ్‌గా కాంగ్ హువాయ్రాయ్ నటించారు. 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు ప్రూక్సా అమరుజి దర్శకత్వం వహించారు. 2026 నవంబర్ 5న Netflixలో విడుదలైంది. ప్రస్తుతం థాయ్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, హిందీ డబ్బింగ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తానికి, ‘దూకుడు’ తరహా ఫేక్ డ్రామా కాన్సెప్ట్, బాలీవుడ్ స్టైల్ యాక్షన్, థాయ్ కామెడీ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునేవారికి ‘ఓవరాక్టింగ్’ ఒక మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్. లాజిక్‌లను పక్కనపెట్టి, భారీ హంగామాతో నవ్వుకోవాలనుకుంటే Netflixలో ఈ సినిమాను ప్రయత్నించవచ్చు.
Read Also: గల్లీ నుంచి గ్లోబల్ స్టేజ్ వరకు మనవడి మ్యూజికల్ బాక్సాఫీస్ సునామీ… గానా రికార్డుల మోత