Korean fantasy legal drama: న్యాయం చేయాల్సిన ఓ జడ్జి… డబ్బు, పలుకుబడికి లొంగిపోయి తప్పుడు తీర్పులు ఇస్తుంటాడు. కానీ తన తీర్పుల వల్ల ఓ కుటుంబం నాశనం కావడం, దాని తర్వాత జరిగిన విషాదం అతని జీవితాన్నే మార్చేస్తుంది. చేసిన తప్పులకు పశ్చాత్తాపపడే సమయానికి అతనికి మరో షాకింగ్ సమస్య ఎదురవుతుంది. చివరకు అతను హత్యకు గురవుతాడు. కానీ చనిపోయిన తర్వాత కళ్లు తెరిచేసరికి… అతను పదేళ్లు వెనక్కి వెళ్లిపోయి ఉంటాడు. ఈసారి గతంలో చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుని, తనను మోసం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కొరియన్ ఫాంటసీ లీగల్ డ్రామా ‘ది జడ్జ్ రిటర్న్స్’ (The Judge Returns). మరి ఈ జడ్జికి రెండో అవకాశం ఎలా వచ్చింది ? గతంలోకి వెళ్లిన తర్వాత ఎవరిపై పోరాటం మొదలుపెట్టాడు ? అన్నది తెలుసుకుందాం.
లీ హాన్-యాంగ్ ఓ జిల్లా న్యాయమూర్తి. చూడడానికి గౌరవప్రదమైన న్యాయాధికారిలా కనిపించినా… ఆయన పెద్ద కార్పొరేట్ లా ఫర్మ్ ఒత్తిడికి తలొగ్గి పని చేస్తుంటాడు. ఆ సంస్థతో ఉన్న సంబంధాల కారణంగా డబ్బు, పలుకుబడికి ప్రభావితమై కొన్ని కేసుల్లో అన్యాయమైన తీర్పులు ఇస్తాడు. అలాంటి ఓ తీర్పు అతని జీవితంలోనే పెద్ద విషాదానికి కారణమవుతుంది. రసాయన ఫ్యాక్టరీ బాధితుడికి న్యాయం జరగకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు.
ఆ ఘటన తర్వాత అతని తల్లి కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఈ పరిణామాలు హాన్-యాంగ్‌ను లోపల నుంచి కుదిపేస్తాయి. ఇంతకాలం తాను చేసిన తప్పులు ఒక్కసారిగా అతనికి అర్థమవుతాయి. ఇకపై నిజాయితీగా పని చేయాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఓ పెద్ద కార్పొరేట్ కేసులో తనకు వచ్చిన ఆదేశాలను ధిక్కరించి… పవర్ ఫుల్ వ్యక్తికి సంబంధించి కఠినమైన తీర్పు ఇస్తాడు. అక్కడితో అతని కెరీర్ ప్రమాదంలో పడుతుంది. తనను కంట్రోల్ చేసే అధికార వర్గాలకు ఎదురు తిరిగిన హాన్-యాంగ్‌పై తప్పుడు హత్య కేసు మోపుతారు. కోర్టు నుంచి తప్పించుకునే సమయంలో అతను ఓ హంతకుడి చేతిలో చనిపోతాడు.
కానీ కథ అక్కడితో ముగిసిపోదు. హాన్-యాంగ్ మళ్లీ కళ్లు తెరిచేసరికి పదేళ్ల క్రితంకి వెళ్లిపోయి ఉంటాడు. తనకు రెండో అవకాశం దొరికిందని గ్రహించిన అతను… ఈసారి అదే తప్పులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. గతంలో ఎవరెవరు భవిష్యత్తులో ప్రమాదకరమైన నేరస్థులుగా మారతారో అతనికి ముందే తెలుసు. అందుకే వారి కదలికలను ముందుగానే పసిగట్టి అడ్డుకోవడం మొదలుపెడతాడు. గతంలో తాను ఇచ్చిన తప్పుడు తీర్పులను సరిదిద్దుతూ… బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు.
మరోవైపు తన మరణానికి కారణమైన చీఫ్ జస్టిస్ కాంగ్ సిన్-జిన్, శక్తివంతమైన వ్యాపారవేత్త జాంగ్ తే-సిక్ తదితరుల సామ్రాజ్యాన్ని కూల్చేందుకు పక్కా ప్లాన్ వేస్తాడు. ఒకప్పుడు అవినీతికి లొంగిపోయిన జడ్జి… ఇప్పుడు అదే వ్యవస్థలోని అవినీతిని అంతం చేయడానికి తిరిగి రావడం కథలో అసలు ఆసక్తి. గతం తనకు తెలుసు కాబట్టి ప్రతి అడుగు ముందుగానే ఊహించగలిగినా… అతని ప్రత్యర్థులు కూడా అంతే శక్తివంతంగా ఉండటంతో పోరాటం మరింత ఉత్కంఠగా మారుతుంది.
మరి ఈసారి హాన్-యాంగ్ నిజంగా న్యాయం సాధించగలిగాడా ? తనను చంపిన వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? గతాన్ని మార్చడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వచ్చాయి? అన్నదే సిరీస్‌లో చూడాల్సిన అసలు పాయింట్.
‘ది జడ్జ్ రిటర్న్స్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. మొత్తం 14 ఎపిసోడ్లు ఒకేసారి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ, కొరియన్ భాషల్లో చూడొచ్చు. టైమ్ ట్రావెల్, కోర్ట్‌రూమ్ డ్రామా, రివెంజ్, ఫాంటసీ కలిసిన కథలు నచ్చే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.
Read Also: 30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్