Retirement Planning: రిటైర్మెంట్ మాట వినగానే చాలామందికి ఒకటే టెన్షన్.. ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించిన డబ్బుతో ముసలితనంలో ప్రశాంతంగా బతకగలమా అని. ఇక 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా చేతిలో పెద్దగా పొదుపు లేకపోతే సమయం మించిపోయింది, ఇప్పుడు మొదలుపెట్టినా ఏం లాభమని నిరాశపడిపోతుంటారు. నిజానికి మీ చేతిలో ఇంకా 20 ఏళ్ల సమయం ఉంటే, సరైన ప్లానింగ్‌తో మీరు ఊహించని స్థాయిలో డబ్బుని కూడబెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ వయసు 40 ఏళ్లు అనుకుందాం. మీరు నెలకు కేవలం రూ. 15,000 తో మ్యూచువల్ ఫండ్ సిప్ (SIP) మొదలుపెట్టి, ప్రతి ఏడాది మీ జీతం పెరిగినట్లే ఆ సిప్ మొత్తాన్ని కూడా కేవలం 10 శాతం పెంచుకుంటూ వెళ్తే చాలు.. మీకు 60 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 3 కోట్ల భారీ రిటైర్మెంట్ ఫండ్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఆ 3 కోట్ల మ్యాజిక్ లెక్క ఎలా పనిచేస్తుంది? 20 ఏళ్లలో మీరు కట్టే అసలు ఎంత, వచ్చే లాభం ఎంత? ఇప్పుడు వివరంగా చూద్దాం.
మీరు 40 ఏళ్ల వయసులో నెలకు రూ.15,000 SIP ప్రారంభించారని అనుకుందాం. ఈ పెట్టుబడిని 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే, ప్రతి నెలా ఒకే మొత్తాన్ని కడుతున్నప్పుడు మీరు పెట్టే అసలు డబ్బు రూ.36 లక్షలు మాత్రమే అవుతుంది. దీనిపై వచ్చే రాబడి మాత్రం మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏడాదికి సగటున 10 శాతం రాబడి వస్తే మీ పెట్టుబడి విలువ సుమారు రూ.1.15 కోట్లు అవుతుంది. అదే 12 శాతం రాబడి వస్తే దాదాపు రూ.1.50 కోట్లు సమకూరవచ్చు. అంటే నెలకు రూ.15,000 స్థిరంగా పెట్టడం ద్వారా రూ.3 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే.
ఇక్కడే స్టెప్-అప్ SIP ఉపయోగపడుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీ పెట్టుబడి మొత్తాన్ని కొంత శాతం పెంచుకుంటూ వెళ్లడం. ఈ ప్లాన్‌లో మొదటి ఏడాది నెలకు రూ.15,000 పెట్టుబడితో ప్రారంభించాలి. రెండో ఏడాది నుంచి దాన్ని 10 శాతం పెంచి రూ.16,500 చేయాలి. మూడో ఏడాది నెలవారీ పెట్టుబడి రూ.18,150 అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెంచుకుంటూ 20 ఏళ్లు కొనసాగించాలి. ఈ విధంగా పెట్టుబడి పెంచుకుంటూ, ఏడాదికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే.. 60 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.95 కోట్ల నిధి సమకూరవచ్చు. అంటే సుమారు రూ.3 కోట్ల లక్ష్యానికి చేరుకోవచ్చు. ఈ కాలంలో మీరు పెట్టే అసలు పెట్టుబడి సుమారు రూ.1.03 కోట్లు. మిగిలిన మొత్తం పెట్టుబడిపై వచ్చే రిటర్న్స్ ద్వారా సమకూరుతుంది.
ఇక మూడు కోట్లు చేతిలో ఉంటే ఇక జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకోకూడదు. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ ధరలు కూడా పెరుగుతాయి. ఈరోజు మీ ఫ్యామిలీ నెలవారీ ఖర్చులు రూ.30,000 అనుకుంటే, ఏడాదికి 6 శాతం ద్రవ్యోల్బణం కొనసాగినట్లయితే 20 ఏళ్ల తర్వాత అదే లైఫ్ స్టైల్ కు నెలకు దాదాపు రూ.96,000 అవసరమవుతుంది. అందుకే రిటైర్మెంట్ సమయంలో ఎంత మొత్తం కావాలనే దానితో పాటు, ఆ డబ్బుతో భవిష్యత్తులో ఎంతకాలం ఖర్చులు నడపగలమో కూడా లెక్కించాలి. అలాగే మీకు ఇప్పటికే ఉన్న EPF, PPF, NPS పొదుపులను కూడా రిటైర్మెంట్ లెక్కలో కలపాలి. వాటి ఆధారంగా SIP ద్వారా అదనంగా ఎంత కూడబెట్టాలో నిర్ణయించుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఏడాది పెట్టుబడిని 10 శాతం పెంచడం మీ ఆదాయానికి సాధ్యమవుతుందా లేదా అనేది ముందుగానే ఆలోచించాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయం: ఈ లెక్కలన్నీ ఏడాదికి 12 శాతం సగటు రాబడి వస్తుందనే అంచనాపై ఆధారపడి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో రాబడికి హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడి విలువ పెరగవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి మీ ఆదాయం, ఖర్చులు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.
Read Also: PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?