Centre Warns Netflix: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన పాకిస్థానీ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేత్’ను భారత్ లో స్ట్రీమింగ్ చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ ఉత్తర్వులు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కి చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్‌లను భారత్ లో ప్రసారం చేయకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ మేరకు గతేడాది మే 8న ఓటీటీ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే భారత్ లోని తమ సబ్ స్క్రైబర్లకు పాకిస్థాన్ లో నిర్మించిన ఏ సినిమా గానీ, సిరీస్ గానీ అందుబాటులో ఉంచమని నెట్ ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
అయితే వచ్చే నెల 4న పాక్ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేత్’ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సమాచార మంత్రిత్వ శాఖనెట్ ఫ్లిక్స్‌కు గుర్తుచేసింది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ పాక్ సిరీస్ ను ప్రచారం చేయకపోవచ్చని తెలుస్తోంది.
అంతకముందు పాక్ సిరీస్ ను భారత్ లో ప్రసారం కాకుండా నిషేధించాలని కోరుతూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యుూఏ), ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యుఐసీఈ) ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. ఈనెల 24న ఏఐసీడబ్ల్యుఏ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా ప్రధానికి రాసిన లేఖలో పాకిస్తాన్ కంటెంట్, ఆ దేశ నటీనటులను శాశ్వతంగా నిషేధించాలని కోరారు.
Also Read: అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!
ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ నెల 28, డిసెంబర్ 5 తేదీల్లో జరగాల్సిన ‘దార్-ఎ-నిజాత్’ అనే పాకిస్థానీ డ్రామా ప్రత్యేక ప్రదర్శనలు సైతం సోషల్ మీడియాలో వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా రద్దయ్యాయి. ఉర్దూ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన తొలి ఉర్దూ ఒరిజినల్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఇందులో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ లతో పాటు హనియా అమీర్, అహద్ రజా మీర్, ఇక్ర అజీజ్, సనమ్ సయీద్ తదితరులు నటించారు.
Also Read: ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!