OTT Movie : దయ్యాల సినిమాలు చూడటానికి జనాలు మామూలుగానే భయపడతారు. అయితే కొన్ని సినిమాలలో మనుషులు చేసే హింసను చూస్తే దయ్యాలే మేలనిపిస్తుంది. అంతలా హింస వీటిలో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక కసాయి మనుషుల మాంసాన్ని, కొన్ని రహస్య జీవులకు ఆహారంగా వేస్తుంటాడు. వినటానికే భయంకరంగా ఉంటే, ఈ సినిమాను చూస్తే మరెంత భయంకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది మిడ్‌నైట్ మీట్ ట్రైన్’ (The midnight meet train). ఈ మూవీకి Ryuhei Kitamura దర్శకత్వం వహించారు. ఇందులో బ్రాడ్లీ కూపర్, లెస్లీ బిబ్, బ్రూక్ షీల్డ్స్ నటించారు. ఈ సినిమా లియోన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ చుట్టూ తిరుగుతుంది. మనిషి మాంసాన్ని విక్రయించే వ్యక్తిని లియోన్ పట్టుకునే క్రమంలో దారుణమైన సంఘటనలు జరుగుతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
న్యూయార్క్ లో లియోన్ ఒక ఫోటోగ్రాఫర్ గా జీవిస్తుంటాడు. నగరంలోని అద్భుతమైన ఫోటోలను తీయాలనుకుంటాడు. అలాగే కొన్ని ఫోటోలను కూడా తనదైన స్టైల్ లో తీస్తాడు. అతని ప్రియురాలు మాయా వెయిట్రెస్‌గా పనిచేస్తుంది. ఒక ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ యజమాని సుసాన్ కి లియోన్ ను పరిచయం చేపిస్తుంది. లియోన్‌కు ఆమె ఇంకా బాగా ఫోటోలు తీసి, మళ్ళీ రమ్మని చెప్తుంది. దీంతో లియోన్ రాత్రిపూట నగరంలోని సబ్‌వేలో తిరుగుతూ చీకటి దృశ్యాలను ఫోటో తీయడం మొదలుపెడతాడు. ఒక రాత్రి, లియోన్ సబ్‌వేలో ఒక యువతిని పోకిరీల నుండి కాపాడతాడు. కానీ మరుసటి రోజు ఆమె అదృశ్యమవుతుందని తెలుసుకుంటాడు. ఈ రహస్యం ఏమిటో కనిపెట్టాలనుకుంటాడు. అతను ఆమె ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతను మహోగనీ అనే వ్యక్తిని కలుస్తాడు. మహోగనీ మానిషి మాంసం విక్రయించే కసాయి. రాత్రి సబ్‌వేలో ప్రయాణికులను దారుణంగా చంపి, వారి శరీరాలను మాంసం హుక్స్‌పై వేలాడదీస్తాడు. లియోన్ మహోగనీని అనుమానంతో వెంబడిస్తాడు.
లియోన్ పోలీసుల దగ్గరికి కూడా వెళ్తాడు. కానీ డిటెక్టివ్ లిన్ హాడ్లీ అతని మాటలను నమ్మదు. లియోన్ స్నేహితులు కూడా ఈ రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ మహోగనీ వారిని కూడా లక్ష్యంగా చేసుకొని చంపేస్తాడు. చివరికి లియోన్ మిడ్‌నైట్ ట్రైన్‌లోకి ప్రవేశించి, మహోగనీతో పోరాడి అతన్ని చంపేస్తాడు. అప్పుడు ట్రైన్ కండక్టర్ లియోన్‌కు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. నగరం కింద ఉన్న కొన్ని పురాతన జీవులకు ఆహారం అందించడం కోసం మహోగనీ ఈ హత్యలు చేస్తున్నాడని . ఇప్పుడు మహోగనీ చనిపోవడంతో, లియోన్ అతని స్థానాన్ని తీసుకోవాలని బలవంతంగా చేస్తాడు. కండక్టర్ లియోన్ నాలుకను కోసి, అతన్ని కొత్త కసాయిగా మారుస్తాడు. ఆ తరువాత లియోన్ మిడ్‌నైట్ ట్రైన్‌లోకి ప్రవేశిస్తాడు, ఇప్పుడు అతనే కొత్త గా ఆ జంతువులకు మాంసాన్ని అందించే కసాయి గా మారుతాడు. ఒక కిక్కెక్కించే థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే, ఈ మూవీని చూసేయండి.