Air Conditioner: బయట ఎండలో తిరిగి వచ్చినప్పుడో లేదంటే.. వాతావరణ మార్పుల వలన వేడిగాలి నుంచి ఉపశమనం పొందడానికో.. ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే వచ్చే హాయే వేరు. అయితే ఏసీ కొనడానికి వెళ్లినప్పుడు చాలామందిని ఒక విషయం అయోమయంలో పడేస్తుంది. అదే.. ఏసీ కెపాసిటీని టన్నుల్లో చెప్పడం. ఇక్కడ టన్ను అంటే ఏసీ బరువు కాదు.. అది ఇచ్చే చల్లదనం. ఈ టన్నుల లెక్క వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి ఏసీలు, ఫ్రిడ్జ్‌లు అందుబాటులోకి రాకముందు.. అంటే 1800ల చివర్లో.. 1900ల మొదట్లో పెద్ద పెద్ద ఇళ్లను, ఆఫీసులను చల్లబరచడానికి భారీ మంచు గడ్డలను వాడేవారు. ఒక టన్ను (సుమారు 2000 పౌండ్లు) బరువున్న మంచు గడ్డ 24 గంటల్లో కరిగిపోతూ ఎంత చల్లదనాన్ని ఇస్తుందో.. దాన్నే ఒక టన్ను కూలింగ్ కెపాసిటీగా పిలవడం మొదలుపెట్టారు. కాలం మారినా ఆ పాత పద్ధతి అలాగే ఉండిపోయింది.
Also Read: పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?
సాధారణంగా ఏసీ సామర్థ్యాన్ని కొలవడానికి BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్) అనే కొలతను కూడా వాడతారు. ఒక గంటలో ఏసీ ఎంత వేడిని బయటకు పంపగలదో ఇది చెప్తుంది. ఒక టన్ను ఏసీ అంటే 12,000 BTUల సామర్థ్యంతో సమానం. ఇల్లు పెద్దదైనప్పుడు 60,000 బీటీయూల ఏసీ అని పిలవడం కంటే.. సింపుల్‌గా 5 టన్నుల ఏసీ అని పిలవడం సులువుగా ఉంటుంది కాబట్టే.. పెద్ద ఏసీలకు టన్నుల లెక్క వాడుతుంటారు.
మన ఇంటి గది సైజును బట్టి సరైన ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. గది పెద్దదై ఉండి, తక్కువ టన్నుల ఏసీ పెడితే ఇల్లు చల్లబడదు. పైగా ఏసీ కంటిన్యూగా తిరగడం వల్ల కరెంట్ బిల్లు పెరగడంతో పాటు మిషన్ కూడా త్వరగా పాడైపోతుంది. అలాగని చిన్న గదిలో పెద్ద ఏసీ పెడితే గదిలో జిగటగా (హ్యుమిడిటీ) ఉండి.. ఏసీ పదే పదే ఆన్ ఆఫ్ అవుతూ త్వరగా పాడవుతుంది.
మీరు ఏసీ పెట్టాలనుకుంటున్న గది వైశాల్యం, అక్కడ ఎండ తీవ్రత, రూమ్ ఇన్సులేషన్ వంటి వాటిని బట్టి ఏ సైజ్ ఏసీ కావాలో లెక్కించుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్ కాలిక్యులేటర్లు కూడా ఉన్నాయి. ఏసీ కొనేటప్పుడు మన సొంత నిర్ణయాల కంటే ఒక మంచి ఏసీ టెక్నీషియన్‌ను అడిగి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. దీనివల్ల డబ్బులు వృధా కాకుండా మనకు సరిపోయే ఏసీని తెచ్చుకోవచ్చు.
Also Read: మొబైల్‌లో సిమ్ కార్డ్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్ ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా?