ఇప్పుడు స్టేట్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పదే పదే వెళ్తున్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షం బీఆరెస్ రాజకీయం చేస్తూ వస్తోంది. ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం ఇంకెవరూ ఉండరు కావొచ్చు.. అని ఒక రకమైన ఎగతాళి చేయడంతో పాటు.. ఢిల్లీకి సంచులు మోయడానికే వెళ్తున్నాడనే ఆరోపణలు కూడా చేస్తూ పార్టీ మైలేజీ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్.
చివరకు ఆ పార్టీ ఆరోపణలు ఎంతగా దిగజారి పోయి ఉన్నాయంటే.. మొన్న రైతులకు ధాన్యం బస్తాలు తక్కువ పడితే.. దానికి కారణం ఆ బస్తాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పైసల సంచులు మోస్తుండనే ఆరోపణలు చేసేంతగా. ఇక బీజేపీ స్టాండ్.. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ఉండనే ఉంది. అక్కడా మేమే ఇక్కడా మేమే .. ఉంటే ఆ అభివృద్ధే వేరు అనేది జనం ఆమోదం కోసం జపించే మంత్రంగా మార్చుకున్నారు. కానీ మిగితా చోట్ల అది చెల్లుబాటు అవుతూ వస్తుందేమో కానీ.. తెలంగాణలో మాత్రం దాని ఎత్తుల పప్పులు ఉడకడం లేదు.
ఇప్పుడు కాంగ్రెస్ నోటి వెంట వస్తున్నది ఢిల్లీ ఇంజన్ సర్కార్. ఇదేందీ కొత్తగా ఉందే పదం .. అనుకుంటున్నారా? అవును .. దాదాపుగా ఈ మాటను సీఎం ప్రతీసారి చెబుతూ వస్తున్నాడు. ప్రతిపక్షాల సీఎం ఢిల్లీటూర్ విమర్శలకు ఆయన తనదైన బాణిని వినిపిస్తున్నారు. అవును.. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా. రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు, అక్కడి అభివృద్ది, పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఎక్కేగడపా, దిగే గడపగా వస్తూనే ఉంటా.. పోతూనే ఉంటా.. అని బాజాప్తాగా చెబుతూ వస్తున్నాడు.
ప్రతిపక్షం ఢిల్లీ టూర్‌పై ఎన్ని ఆరోపణలు, అస్త్రాలు సంధించినా ఆయన చేసేది చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ విషయం ప్రస్తావనకు రావడం వెనుక.. ఈ ఢిల్లీ ఇంజన్ సర్కార్ .. అనే పదప్రయోగం చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం.. నిన్న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మాట్లాడిన మాటలు.
ఆయన బీజేపీ పెద్దల సహకారం తీసుకునే క్రమంలో మోడీని కీర్తించారు. ఆయన వికసిత్ భారత్ నినాదాన్నీ గుర్తు చేశారు. పీఎం మానస పుత్రిక లాంటి ఆ నినాదాన్ని ఎత్తుకుని దాని గురించి ప్రస్తావించి.. కీర్తించడం కూడా ఓ రాజకీయ వ్యూహంలో భాగమే. రాష్ట్రం చక్కదిద్దుకునే పనిలో, తెలంగాణకు మేలు జరిగేలా, అనుకున్న పనులు నెరవేలా వేసే రాజకీయ అడుగులో భాగంగానే ఆ వ్యాఖ్యలను చూడాల్సి వస్తుంది.
రాజకీయంగా తెలంగాణ వేదికగా బీజేపీని ఎంత విమర్శించాలో అంత విమర్శిస్తూనే .. ఢిల్లీ పెద్దలతో చర్చలు, సంప్రదింపులు, వినతులు ఇస్తూనే ఉన్నారు. మెట్రో విషయంలో, రీజనల్ రింగు రోడ్డు అంశంలో… ఇదే ఫార్మూలా కనిపించింది. కిషన్‌రెడ్డి కూడా కొంత మెత్తబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే.. సీఎం నోటికి భయపడ్డాడు. ఇక తాజాగా ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్టుల నిర్మాణం పై ఓ క్లారిటీ వచ్చింది. దీనికి డెడ్‌లైన్ విధించి మరీ పూర్తి చేసేలా కేంద్రం నుంచి సన్నాహాలకు చర్యలు తీసుకునేలా ముందడుగు వేయడంలో సీఎం సక్సెసయ్యారనే చెప్పాలి.
ఇదే సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చర్చకు తెర తీస్తున్నాయి. అన్ని పనులు అవుతున్నాయా? అని అడిగిన ప్రశ్నకు.. అన్యాయమే జరుగుతుందనే మాట రాలేదు ఆయన నోటి వెంట. కొన్ని అవుతున్నాయి. ఇంకా కావాల్సి ఉన్నాయని మధ్యే మార్గంగా ఇచ్చిన సమాధానం కూడా కేంద్రంతో సత్సంబంధాలు నెరిపే భవిష్యత్ కార్యాచరణగానే చూడాలి.
ఎంతగా మన నుంచి ప్రయత్నం ముమ్మరంగా ఉంటే.. అంత త్వరగా పనులు జరుగుతాయనే తన అనుభవాన్నిఈ సందర్భంగా తెలియజేయడం కూడా.. మేం ప్రయత్నం చేయడంలో వెనుకకు రాం.. ఒకటికి పదిసార్లు వస్తాం.. కానీ మీరు తప్పకుండా చేయాల్సే ఉంటుందనే పరోక్ష సంకేతం కేంద్రానికి ఇచ్చినట్టైంది. అంతే కాదు… తెలంగాణపై అభిమానంతో చేస్తున్నారనే పదం కూడా ఏపీలోని ఎంపీలను మచ్చిక చేసుకోవడం ద్వారా.. అక్కడి కూటమి ప్రభుత్వం ద్వారా కాగల కార్యం గంధర్వులు చేసి పెట్టినట్టుగా కొన్ని కేంద్రం వినని పనులకు కూడా ఆమోదం పొందేలా చేసుకోవడం కూడా సీఎం రేవంత్ వ్యూహంలో భాగంగా చూడొచ్చు.
ఇక్కడ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అనే పదాన్ని ఉపయోగించి.. జనాన్ని డైవర్టు చేసే విధానానికి రేవంత్ ఈ విధంగా గండికొట్టారనే చెప్పాలి. కేటీఆర్ తరుచూ ఆరోపించే వాటికి బలం లేదనే విధంగా తన చర్యలతో, ఫలితాలతో ఈ విధమైన కౌంటర్ ఇచ్చారని కూడా అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నినాదం.. ఢిల్లీ ఇంజన్ సర్కార్ అయ్యిందనే విధంగా చర్చ జరుగుతుంది. అది రాష్ట్ర అభివృద్దికే అనే విషయం.. ఇక్కడి నేతలు బలంగా జనాల్లోకి తీసుకుపోవాల్సి ఉంది.
కేసీఆర్ తో పోల్చి చూస్తే.. రేవంత్ ఈ ఢిల్లీ వ్యవహారాలు, కేంద్ర పెద్దలతో సత్సంబంధాల విషయంలో బాగానే నాడి పట్టుకుని.. తనకు అనుకున్నవి చేయించుకునే విషయంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలి. బడేమియా చోటేమియా.. ఇద్దరిదీ రహస్య దోస్తానా..? అంటూ బీఆర్ఎస్ చేసేవి బేస్‌లెస్ ఆరోపణలే. ఇలాంటి ఆరోపణలు కనీసం జనాల్లో చర్చ కూడా రాదు. ఈ రెండు జాతీయ పార్టీల విధానాలు వేరు. ఈ అంశంలో బట్టకాల్చి మీదేయాలనే ఆలోచన కూడా మరీ చీప్ అనే చెప్పాలె.