మోడీ వ్యూహం బెడిసికొట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును తెరమీదకు తెచ్చి.. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదింపజేసుకుందామనుకున్న బీజేపీ ఎత్తుగడలకు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. సభలో బిల్లుల ఆమోదానికి సరిపడా బలం లేదని తెలిసినా.. మోడీ, అమిత్ షా ద్వయం రాజకీయ చతురత ప్రదర్శించారు. ఓ వైపు తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. హడావుడిగా ఈ బిల్లుల ఆమోదం ప్రక్రియను వ్యూహంలో భాగంగా తెరమీదకు తెచ్చింది మోడీ సర్కార్.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు అనే సాకును చూపుతూ.. దీని కోసం డీలిమిటేషన్ ప్రక్రియను తెరమీదకు తెచ్చింది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఒకేసారి 50 శాతం లోక్‌సభ సీట్ల పెంపు ప్రక్రియ దక్షిణాదికన్నా ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరగుతుందని, తద్వారా మళ్లీ బీజేపీనే కేంద్రలో అధికారంలోకి రావడానికి చేసే రాజకీయ పన్నాగమని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అయితే కేంద్రం తెలివిగా.. ఈ బిల్లులు వీగిపోతే.. మహిళా బిల్లును వ్యతిరేకించిన వారవుతారని, దేశ వ్యాప్తంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి మహిళాలోకం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ వినలేదు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సబ్ కోటా లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అన్యాయం చేసేవిధంగా ఉందని, దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని కుండబద్దలు కొట్టింది.
బీజేపీ బెదిరింపులకు ఏమాత్రం భయపడలేదు. సరైన బలం లేకున్నా ఓటింగ్ దిగిన కేంద్రానికి 48 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో డీలిమిటేషన్‌కు చాన్స్ లేకుండా పోయింది. మహిళా బిల్లుకు బ్రేక్ పడింది. రేపు శనివారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేశారు. అయితే తదుపరి బిల్లులు ప్రవేశపెట్టే నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఒకవేళ శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా దానికి కూడా టూ థర్డ్ మెజారిటీనే కావాల్సి ఉంటుంది. దీంతో అదీ వీగిపోనుంది.
మొత్తానికి మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడినట్టయ్యింది. ఆశ పెట్టి .. దోబూచిలాడి మళ్లీ మహిళా బిల్లు అటకెక్కింది. దీని ద్వారా కేంద్రం .. తాము మహిళలకు అనుకూలంగా ఉన్నామని, వారిని రాజకీయంగా బలోపేతం చేయాలని భావిస్తే.. కాంగ్రెస్ అడ్డుకుందనే సంకేతం పంపాలనుకున్నారు. అయితే అది కాంగ్రెస్‌ను ఎంత మేర నష్టం చేస్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు మహిళా రిజర్వేషన్‌లో సబ్ కోటా లేకపోవడం కారణమని చెప్పనుంది.
దీంతో అంతగా మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా? అనేది సందేహాస్పదమే. ఇక మోడీ, అమిత్ షాల ద్వయం దీని వెనుక ఉత్తరాదిని బలపరిచే కుట్ర దాగుందనే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ బిల్లు వీగిపోవడం కాంగ్రెస్ తన విజయంగా భావిస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం లోక్‌సభలో అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఆమాంతం పెరిగిపోనున్న ఉత్తరాది లోక్‌సభ సీట్ల సంఖ్య.. మళ్లీ బీజేపీకి అధికారం కట్టబెట్టే బాటలోనే ఉంటుందనే ప్రతిపక్షాల అంచనాకు తగ్గట్టుగా ఈ బిల్లు వీగిపోవడం.. మోడీ, అమిత్ షాలకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పాలి.
ఓ ప్రయోగం చేశారు. పోతే వెంట్రుక.. లేదా కొండ.. అని కొండను లాగే ప్రయత్నం చేసి విఫలం చెందారు. కానీ మోడీ,షా ల వ్యూహాలకు ఇది పెద్ద షాకేనని చెప్పాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీన్ని రాజకీయ అస్త్రంగా బీజేపీ వాడుకోనుంది. మరి మహిళామణుల ఓట్లు ఎన్ని రాబట్టుకుంటుందో.. దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకుంటారా..? అనేది చూడాల్సి ఉంది.