కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయ్యింది. కానీ, దానిని 2029 జమిలి ఎన్నికల సమయంలో అమలు చేస్తామని నాడు పాస్ అయిన బిల్లులో పొందుపరిచింది.అయితే, ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.మే రెండోవారంలోగా ఫలితాలు కూడా వెలువడనున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 2029లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపిన కేంద్రం.. అనూహ్యంగా వచ్చే ఏడాది నుంచే అమలు చేయాలని భావించింది.అందుకోసం ఈనెల16న పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సవరణ చేసి వెంటనే అమలులోకి తేవాలని ప్రయత్నించింది.
కేంద్రం కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చేవి. కానీ, ఆ బిల్లు మాటున నియోజకవర్గాల పునర్విభజన బిల్లును లింగ్ చేయడం వారికి కోపం తెప్పించింది. దక్షిణాది రాష్ట్రాలు సైతం డీలిమిటేషన్‌కు ఇప్పుడు సిద్ధంగా లేవు. జనగణన తేలాక అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచాలని సౌత్ స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా 50 శాతం సీట్లు పెంచుతామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికలు ఉండటం వలన దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇండియా కూటమిలోని పార్టీలు సైతం తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామని, డీలిమిటేషన్‌కు ఇవ్వబోమని ప్రకటించాయి. ఓటింగ్ సమయంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి.
ఇండియా కూటమి నేతలు ముందుగా చెప్పినట్టుగానే మహిళా రిజర్వేషన్ బిల్లు మాటున తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును పాస్ కానివ్వకుండా వ్యతిరేకంగా ఓటు వేయడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు సైతం ఆమోదం పొందలేదు.ఫలితంగా మిగతా రెండు బిల్లులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా మోడీ కుటిల రాజకీయాలను తాము ఓడించామని ఇండియా కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్డీయే కూటమి మాత్రం మహిళలకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్లు రాకుండా చేశారని ఆరోపిస్తున్నది. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చినప్పుడు.. బిల్లు అమలుకు 2029 వరకు ఎందుకు ఆగాలి? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
తీరా ఇప్పుడు వెంటనే మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు తెచ్చిన సవరణ బిల్లును ఇండియా కూటమి పార్టీలు అడ్డుకున్నాయి. విపక్షాల నిర్ణయం వలన వెంటనే అమలులోకి రావాల్సిన రిజర్వేషన్లు మరికొంత కాలం వరకు అమలులోకి రాకుండా అయ్యాయి. అయితే, కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.ఒకవేళ కేంద్రం మరోసారి ప్రత్యేకంగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించి బిల్లును అమలులోకి తెస్తుందా? లేదా 2029లోనే అమలు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది. ఒకవేళ ప్రత్యేక సెషన్స్ నిర్వహించి బిల్లు ఆమోదం పొందితే.. తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. విపక్షాల విజయం ప్రస్తుతం మహిళలకు శాపంగా మారిందని చెప్పవచ్చు.