రాజకీయాల్లో తలపండిపోయిన మోడీ, షా ద్వయాలకు ఎదురుదెబ్బ తగిలింది. తమ వ్యూహాలకు పదును పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తెరమీదకు తెచ్చిన ఎన్డీయే.. డీలిమిటేషన్‌కు ముడిపెట్టిన విధానాన్ని ఎన్డీ కూటమి గట్టిగానే ఎదుర్కొన్నది. మహిళా బిల్లు పేరుతో ప్రతిపక్షం వెనక్కి తగ్గుతుందని మోడీ భావించారు. కానీ నిజంగా మహిళా బిల్లు ఆమోదం చిత్తశుద్దితో చేయాలనుకుంటే.. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా చేయొచ్చు కదా… అనే వాదనను ఇండియా కూటమి బలంగా తీసుకుపోవడంలో సక్సెసయ్యింది.
మహిళా సెంటిమెంటును రాజేసి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనుకున్నా.. చాలా స్పష్టతతో రాహుల్ గాంధీ వ్యవహరించిన విధానం చర్చనీయాంశమైంది. చర్చ సందర్భంగా ఆయన చాలా అంశాలను నేరుగానే మాట్లాడారు. మహిళా బిల్లు అని ఇప్పుడు కొత్తగా తీసుకురావడమేంది? అది 2023లోనే ఆమోదం పొందింది కదా? ఒకవేళ కొత్త బిల్లు తీసుకురావాలనుకుంటే.. పాతదాన్ని రద్దు చేయండని అన్నారు. మహిళా బిల్లులో సబ్ కోటా లేదని లేవనెత్తిన రాహుల్.. డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణను కూడా ఇందులో మిలితం చేయడాన్ని తప్పుబట్టారు.
ఒకవేళ మహిళా బిల్లును నియోజకవర్గాల పెంపు లేకుండా అమలు చేస్తామని కేంద్రం ముందుకు వస్తే.. అప్పుడు ఇండియా కూటమి వ్యతిరేకిస్తే.. నిజంగానే కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవనే భావన ఉంది. కానీ ఇక్కడ కేంద్రం లోపాయికారి మతలబుతో పెట్టిన బిల్లులపై క్లారిటీ మిస్ అయ్యింది. జనానికి ఇది ఓ రాజకీయ వ్యూహమని తెలిసిపోయింది. బీజేపీ తన పాలసీలో భాగంగా తీసుకునే చాలా నిర్ణయాల్లో ఇదీ ఓ భాగమనేది తెలిసిపోయింది. అయితే మోడీ, షాలకు ఓడిపోవడం తెలియదనే ప్రచారం ఉంది. అందుకే దీనిపై ఉత్కంఠ పెరిగింది. ఏం జరుగుతుంది? అని. కానీ ఏదో ఊహించినట్టు జరగలేదు. అంతా కరెక్టుగానే ఉన్నారు. ఎవరికి వారు ఏం చేయాలో అదే చేశారు.
ఓడినా.. కాంగ్రెస్‌ను ఎలా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేయాలో కూడా తరువాత పరిణామాలను ముందుగానే సిద్దం చేసుకుని పెట్టుకున్నది బీజేపీ. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకున్నదని బాగా ప్రచారం చేసింది. దీంతో నష్ట నివారణకు రాహుల్.. రేవంత్‌ను రంగంలోకి దింపారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చాలా క్లారిటీగా.. తమ విధానాన్ని తెలియజేశారు. మహిళా బిల్లును ఇప్పుడు మళ్లీ ప్రవేశ పెట్టినా ఆమోదిస్తామని బంతిని బీజేపీ కోర్టులోకి వేశారు. ఇప్పుడున్న సీట్లలోనే 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిచేందుకు మేము రెడీగా ఉన్నామన్న రేవంత్.. ఆ తరువాత సబ్ కోటా కూడా ఇవ్వాలనే ప్రతిపాదనను బిల్లులో చేర్చి .. ఆమోదానికి పెడితే.. ఇండియా కూటమి మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.
నిజానికి ఈ వివరాలు ఏఐసీసీ పెద్దలు వెల్లడించాలి. కానీ రేవంత్ .. మొదటి నుంచి బీజేపీ బిల్లులను బలంగా వ్యతిరేకించారు. హైబ్రీడ్ విధానాన్ని సూచించారు. కేంద్రానికి లేఖ రాశారు. ఇవన్నీ జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెర లేపింది. ఈ క్రమంలో రేవంత్‌కు అధిష్టానం వద్ద మరింత పలుకుబడి పెరిగిందంటున్నారు. బిల్లులు వీగిపోయిన తరువాత.. రేవంత్‌తోనే ఈ విషయంలో ప్రెస్‌మీట్ పెట్టించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇది బీజేపీ అహంకారంతో పెట్టిన బిల్లుగా రేవంత్ విమర్శించారు. నిజంగా నియ్యతితో బిల్లు పెడితే వేరేలా ఉండేదని, దీంట్లో రాజకీయ కుట్ర ఉందని, దీనికి మహిళా రిజర్వేషన్ అనే ముసుగు వేశారని స్పష్టం చేశారు. మోడీ, అమిత్‌షాలకు గర్వభంగం జరిగిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు పెడితే తాము మద్దతు తెలుపుతామన్నారు. దీని కోసం నియోజకవర్గాల పెంపు అవసరం లేదన్నారాయన.. రాజకీయంగా అవకాశాలు తగ్గుతాయి కదా.. అనే ప్రశ్నకు తాము సీట్లను త్యాగం చేయడానికి రెడీ అన్నారాయన.
దీంతో బీజేపీ .. కాంగ్రెస్‌పై చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్‌కు ఏమాత్రం నష్టం జరగకుండా.. నష్ట నివారణ కోసమే రేవంత్‌ను రంగంలోకి దింపారనే విషయం అర్థమవుతోంది. బీజేపీ బిల్లుల వల్ల తెలంగాణ సర్కార్్ పరపతి అక్కడ ఆమాంతం పెరిగిపోయింది. పార్లమెంటులో చర్చల్లో కూడా పలు మార్లు తెలంగాణ సీఎం ప్రతిపాదనపై చర్చ జరగడంతో రేవంత్ ఈ ప్రత్యేక పార్లమెంటు సెషన్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారని చెప్పొచ్చు.