No Cooking Recipes: ఒకవైపు గ్యాస్ ధరల పెంపు.. మరోవైపు ఎండల తీవ్రత వలన చాలామంది ఉదయం పూట అల్పాహారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అసలు గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండానే ఏదైనా వంటకాలు చేసుకుని తింటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అటు స్టవ్ వెలిగించకుండా, ఇటు సమ్మర్‌లో శరీరానికి చల్లగా మంచి పోషకాలు అందేలా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఐదు రకాల హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో కాస్త సైంధవ లవణం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా గెలకొట్టండి. దీనికి గంట ముందు నానబెట్టిన చియా సీడ్స్, వేయించిన మఖానా, దానిమ్మ గింజలు, ఎండు కొబ్బరి తురుము, కొన్ని వేరుశెనగ పప్పులు, బాదం ముక్కలు కలపండి. ఇది తినడానికి ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
చాక్లెట్ ఇష్టపడే వారికి ఈ అల్పాహారం కచ్చితంగా నచ్చుతుంది. రెండు అరటి పళ్లు, ఒక చెంచా కోకో పౌడర్, అర చెంచా చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ తీసుకుని, కొబ్బరి పాలతో కలిపి గ్రైండ్ చేయండి. దీనిపై కొబ్బరి తురుము, ప్రోటీన్ గ్రానోలా, మిక్స్డ్ సీడ్స్, బాదం లేదా వాల్నట్ ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
Also Read: సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా చేసే బాదం షర్బత్.. తయారీ విధానం ఇదే!
ఒక కప్పు వండిన అన్నాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, ఆ అన్నంలో ఒక కప్పు తాజా పెరుగు, దానిమ్మ గింజలు, సైంధవ లవణం, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము కలపండి. పోపు కోసం.. కొద్దిగా నెయ్యి వేసి అందులో ఇంగువ, జీలకర్ర, ఆవాలు, వేరుశెనగ పప్పులు వేసి వేయించి, అన్నంలో కలపండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన పానీయం సత్తు ఛాస్. ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు, రెండు చెంచాల సత్తు పిండి (వేయించిన శనగపిండి) తీసుకోండి. దానిలో చిటికెడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఎండిన పుదీనా ఆకుల పొడి, సైంధవ లవణం వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒకటి నుండి రెండు గ్లాసుల నీళ్లు పోసి మళ్లీ కలపండి. చివరగా ఒకటి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సత్తు ఛాస్ రెడీ.
వేసవిలో మామిడి పండ్లతో చేసుకునే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఒక కప్పు గ్రీక్ యోగర్ట్ తీసుకుని, అందులో సగం మామిడి పండు ముక్కలు, ఒకటి రెండు చెంచాల నానబెట్టిన చియా సీడ్స్, కొద్దిగా గ్రానోలా, కొన్ని నట్స్ కలపండి. ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు, అవసరమైన పోషకాలను అందిస్తుంది.
Also Read: ప్రెజర్ కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్.. అచ్చం బేకరీ స్టైల్‌లో!