Restaurant Style Malai Kofta: సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు స్పెషల్ వెజ్ డిష్‌గా ఆర్డర్ చేసే వాటిలో ‘మలై కోఫ్తా’ మొదటి వరుసలో ఉంటుంది. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోయే కోఫ్తాలు, క్రీమీగా ఉండే గ్రేవీ దీని ప్రత్యేకత. అయితే.. అదే రుచిని మనం ఇంట్లో తీసుకురావడం కష్టమని చాలామంది భావిస్తారు. కానీ, సరైన కొలతలు , కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే.. మీ వంటిల్లే ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లా మారిపోతుంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా వీకెండ్ స్పెషల్‌గా ఈ రిచ్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మలై కోఫ్తాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
కోఫ్తాల కోసం:
ఉడికించి తురిమిన బంగాళదుంపలు: 2 కప్పులు
తురిమిన పన్నీర్: 1 కప్పు
మైదా పిండి: 2-3 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి: 2
కారం, ఉప్పు: రుచికి తగినంత
గరం మసాలా: 1/2 టీస్పూన్
జీడిపప్పు ముక్కలు, కిస్‌మిస్: కొద్దిగా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
గ్రేవీ కోసం:
ఉల్లిపాయ ముక్కలు: 2
టమాటోలు: 3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు: 10-12 (నానబెట్టినవి)
ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ: 1/2 కప్పు
చెక్క, లవంగాలు, ఇలాచీ: తలా రెండు
కారం: 1 టీస్పూన్, పసుపు: 1/4 టీస్పూన్
కసూరి మేథీ: 1 టీస్పూన్
వెన్న : 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బంగాళదుంపలు, పన్నీర్, మైదా, పచ్చిమిర్చి, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి. పిండి ముద్దలా తయారైన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు నచ్చితే ఆ ఉండల మధ్యలో ఒక జీడిపప్పు ముక్క, కిస్‌మిస్ పెట్టి మూసేయండి. వీటిని మైదా పిండిలో ఒకసారి దొర్లించి, వేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
2.కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అవసరమైతే వడకట్టుకుంటే గ్రేవీ చాలా స్మూత్‌గా వస్తుంది.
Also Read: వెజిటేరియన్ చేపల కూర.. శనగపిండి ముక్కలతో అదిరిపోయే టేస్ట్, ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
3. అదే కడాయిలో వెన్న వేసి కరిగిన తర్వాత హోల్ స్పైసెస్ (చెక్క, లవంగం) వేయాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటో-ఉల్లిపాయ పేస్ట్‌ను వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇందులో కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్లు పోసి గ్రేవీని దగ్గరకు పడనివ్వాలి.
4. గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్, కస్తూరి మేథీ, కొద్దిగా పంచదార (ఆప్షనల్) వేయాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి. కోఫ్తాలను ముందుగానే గ్రేవీలో వేయకూడదు. సర్వ్ చేసే ముందు మాత్రమే ప్లేట్‌లో కోఫ్తాలు పెట్టి, దానిపై వేడి వేడి గ్రేవీని పోయాలి. అప్పుడే కోఫ్తాలు విడిపోకుండా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.