Minapappu Masala Vada: మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునే సాధారణ గారెల కంటే కాస్త భిన్నంగా, మసాలా ఘాటుతో నోటికి కరకరలాడుతూ తగిలే మినప్పప్పు మసాలా వడలు చేసుకుంటే ఆ టేస్టే వేరు. సాయంత్రం పూట గానీ వర్షం పడుతున్నప్పుడు గానీ వేడివేడి టీతో కలిపి ఈ వడలను తింటుంటే ఇక స్వర్గమే. మెంతికూర, కొత్తిమీర సువాసనలతో పాటు అల్లం వెల్లుల్లి ఘాటు తోడై, ఈ వడలు ఇంటిల్లిపాదికీ నచ్చే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడీ మినప్పప్పు మసాల వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
పొట్టు మినప్పప్పు – కప్పు
పచ్చి మిర్చి – ఐదు (చిన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం – చిన్న ముక్క
వెలుల్లి రెబ్బలు – ఎనిమిది
ఉల్లిపాయలు – అరకప్పు (సన్నగా తరగినవి)
మెంతికూర తరుగు – పావుకప్పు
కొత్తిమీర తరుగు – పావుకప్పు
వాము – స్పూన్
పసుపు – అర స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
కారం – స్పూన్
దనియాలపొడి – స్పూన్
నూనె – వేయించడానికి సరిపడా
వడలకు కావాల్సిన మినపప్పును నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. ఇక పచ్చిమిర్చి. అల్లం, వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుతో పాటు నూనె తప్ప మిగిలిన పదార్ధాలను పిండిలో కలిసి తర్వాత వడల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకుంటే నోరూరించే మినప్పప్పు మసాలా వడలు రెడీ.