Chicken Curry: చికెన్ వండటం పెద్ద కష్టమేమీ కాదు కానీ, చాలామందికి వచ్చే ప్రధాన సమస్య ముక్క గట్టిగా అయిపోవడం లేదంటే లోపల చప్పగా ఉండటం. ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా వండుకున్నా, కొన్నిసార్లు రెస్టారెంట్లో దొరికే ఆ మెత్తదనం, రుచి రావు. నిజానికి చికెన్ కర్రీ అద్భుతంగా రావాలంటే మసాలాల మోతాదుతో పాటు వండే పద్ధతి కూడా చాలా ముఖ్యం. ముక్క నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతూ, గ్రేవీ అన్నంలోకి లేదా చపాతీలోకి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ ఒకసారి వండి చూడండి. మీ ఇంట్లో వాళ్లు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు.
చికెన్ – అర కిలో
ఉల్లిపాయలు – మూడు మీడియం సైజు
టమోటాలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – అర కప్పు
కారం – తగినంత
పసుపు – అర స్పూన్
ఉప్పు – రుచికి సరపడా
ధనియాల పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా – కొద్దిగా
పచ్చిమిర్చి – రెండు
కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
లవంగాలు, యాలకులు – నాలుగేసి పలుకులు
దాల్చిన చెక్క, నూనె – వంటకు సరిపడా
Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పెరుగు, కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక స్పూన్ నూనె వేసి బాగా కలిపి కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క మెత్తగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ మసాలా దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆపై టమోటా ముక్కలు కూడా వేసి మెత్తగా ఉడికించాలి.
ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్‌ను ఇందులో వేసి మంటను పెద్దగా పెట్టి ఐదు నిమిషాల పాటు వేయించాలి. దీనివల్ల చికెన్‌లోని నీరు బయటకు వచ్చి ముక్క గట్టి పడకుండా ఉంటుంది. తర్వాత కారం, ధనియాల పొడి వేసి కలిపి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో రుచికరమైన జ్యూసీ చికెన్ కర్రీ రెడీ.
Also Read: మజ్జిగ చారు ఇలా చేస్తే.. అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు, బామ్మల కాలం నాటి రహస్యం ఇదే!