Majjiga Pulusu: వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు ఒళ్లంతా సెగలు పుడుతుంటాయి. ఎంత నీళ్లు తాగినా, ఎన్ని జ్యూసులు తాగినా భోజనం చేసేటప్పుడు మాత్రం ఏదైనా చల్లగా, కడుపుకు హాయిగా ఉండేలా తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మన బామ్మల కాలం నాటి మజ్జిగ చారు అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకునే ఈ వంటకం కేవలం రుచికరమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్నంలోకి కాస్త ఆవకాయ నంజుకుని ఈ మజ్జిగ చారుతో తింటే ఆ టేస్ట్ భలే ఉంటుంది.
దీని తయారీ కోసం ఒక కప్పు చిక్కటి పెరుగు, రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు తీసుకోవాలి. తాలింపు కోసం రెండు చెంచాల నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి చీలికలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర సిద్ధం చేసుకోవాలి.
Also Read: వేసవి సెలవుల్లో పిల్లల కోసం స్పెషల్ మిల్క్ షేక్స్.. రెండు నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు!
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని గడ్డలు లేకుండా బాగా చిలకాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి మజ్జిగలా చేసి, ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగాక స్టవ్ ఆపేసి, ఆ వేడి మీదనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయలు మరీ మగ్గిపోకుండా పచ్చిగా ఉంటేనే తింటున్నప్పుడు రుచిగా ఉంటాయి. ఈ తాలింపు మిశ్రమం కొంచెం చల్లారాక, సిద్ధంగా ఉన్న మజ్జిగలో పోసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ చారు సిద్ధమవుతుంది.
మజ్జిగ చారు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే చలవ చేస్తుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎండలో తిరిగి వచ్చిన వారికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడటమే కాకుండా, ఇందులోని అల్లం, పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. తక్కువ కేలరీలు ఉండి కడుపు నిండుగా అనిపించేలా చేసే ఈ వంటకం వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read: చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!