Mutton Shami Kebabs: ముస్లిం పెళ్లిళ్లు, పంక్షన్ల సమయంలో ‘మటన్ షమీ కబాబ్’ రెసిపీ తప్పకుండా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఈ కబాబ్స్ అద్భుతమైన రుచిని ఇస్తాయి. మటన్ కీమా, శనగపప్పునతో పాటు మరికొన్ని పదార్థాలను ఉడికించి వీటిని కబాబ్స్ తయారు చేస్తారు. వీటిని స్టార్టర్‌గా లేదా పప్పు చారు, బిర్యానీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో సాఫ్ట్ షమీ కబాబ్స్‌ను ఎలా చేసుకోవాలో వివరంగా ఇప్పుడు చూద్దాం.
స్పైసీ, టేస్టీ మటన్ షమీ కబాబ్ రెసిపీ:
షమీ కబాబ్ అనేది ఒక క్లాసిక్ మొఘలాయ్ వంటకం. దీనిని తయారు చేయడం కొంచెం ఓపికతో కూడిన పనే అయినా.. ఆ రుచి చూశాక పడ్డ కష్టమంతా మర్చిపోతారు.
కావాల్సిన పదార్థాలు:
మటన్ కీమా (ఎముకలు లేనిది): 500 గ్రాములు
శనగపప్పు: 150 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 3-4
పెద్ద ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
ఎండుమిర్చి: 4-5
మసాలా దినుసులు: దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, షాజీరా, మిరియాలు.
పొడులు: పసుపు, కారం, గరం మసాలా.
పుదీనా, కొత్తిమీర: అర కప్పు (సన్నగా తరిగినవి)
గుడ్డు: 1
నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
1. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో కడిగిన మటన్ కీమా, నానబెట్టిన శనగపప్పును వేయండి. అందులోనే ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొద్దిగా నీరు పోయండి. నీరు మరీ ఎక్కువగా పోయకూడదు. కేవలం పదార్థాలు మునిగితే చాలు. కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు లేదా మటన్ బాగా మెత్తబడే వరకు ఉడికించాలి.
2. ఉడికిన తర్వాత కుక్కర్‌లో ఏమైనా నీరు మిగిలి ఉంటే.. మళ్ళీ పొయ్యి మీద పెట్టి నీరంతా ఇంకిపోయేలా ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా పడాలి. అప్పుడే కబాబ్స్ విడిపోకుండా వస్తాయి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
3. చల్లారిన మిశ్రమం నుంచి పెద్ద మసాలా దినుసులు (దాల్చిన చెక్క వంటివి) తీసేసి, మిగిలిన దాన్ని మిక్సీలో వేసి చాలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే కబాబ్స్ అంత సాఫ్ట్‌గా వస్తాయి.
4. ఈ మెత్తని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పొడి వేయండి. ఇందులోనే ఒక గుడ్డును పగలగొట్టి వేయండి. గుడ్డు వేయడం వల్ల కబాబ్స్ నూనెలో విడిపోకుండా ఉంటాయి. వీటన్నింటినీ బాగా కలపాలి.
5. చేతులకు కొంచెం నూనె రాసుకుని, కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చుట్టి, అరచేతితో నొక్కి ఫ్లాట్ టిక్కీల్లా తయారు చేసుకోవాలి.
6. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. నూనె వేడయ్యాక సిద్ధం చేసుకున్న కబాబ్స్‌ను వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి.
Also Read: అన్నం, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఈ ఇన్స్టంట్ మిర్చి పచ్చడి ట్రై చేయండి
ముఖ్యమైన చిట్కాలు:
మటన్ ఎంపిక: కీమాలో కొవ్వు కొద్దిగా ఉంటే కబాబ్స్ జ్యూసీగా వస్తాయి.
శనగపప్పు: పప్పు ఎక్కువైతే మటన్ రుచి తగ్గుతుంది. కాబట్టి సరైన నిష్పత్తిలో వేయండి.
పచ్చడి: ఈ కబాబ్స్‌ను పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తే అదిరిపోతాయి.