Sugarcane Juice Ice Cream: అబ్బో.. ఇప్పుడున్న ఎండలకు బయట అడుగుపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. మాడు పగిలే ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ లాగించేస్తుంటాం. అయితే ఎప్పుడూ తినే అవే వెనిలా, చాక్లెట్ ఫ్లేవర్లు కాకుండా.. స్వచ్ఛమైన చెరుకురసంతో ఐస్‌క్రీమ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే కొత్తగా, క్రేజీగా ఉంది కదూ! ఈ ఐస్‌క్రీమ్ కేవలం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా, ఇంట్లోనే నాచురల్‌గా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుని తినేలా ఈ చెరుకురసం ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
తాజా చెరుకురసం – 2 కప్పులు
ఫ్రెష్ క్రీమ్ (లేదా) విప్పింగ్ క్రీమ్ – ఒక కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ – అర కప్పు (తీపికి తగ్గట్టు)
నిమ్మరసం – ఒక టీస్పూన్
అల్లం రసం – కొద్దిగా (మంచి ఫ్లేవర్ కోసం)
ఉప్పు – చిటికెడు
Also Read: జిమ్ లవర్స్ కోసం హై ప్రోటీన్ మష్రూమ్ ఆమ్లెట్.. తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా!
ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన తాజా చెరుకురసాన్ని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బాగా చల్లగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ వేయండి. అది కాస్త చిక్కబడే వరకు విస్కర్ లేదా బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి. క్రీమ్ సాఫ్ట్‌గా, ప్లఫ్ఫీగా తయారయ్యాక అందులో కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరోసారి కలపండి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చెరుకురసాన్ని ఈ మిశ్రమంలో పోసి, ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలిపేయాలి.
ఇక ఆ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పోసి, పైన అల్యూమినియం ఫాయిల్ లేదా మూత పెట్టి ఫ్రీజర్‌లో సుమారు 7 నుంచి 8 గంటల పాటు గట్టి పడనివ్వాలి. ఐస్‌క్రీమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాక బయటకు తీసి, స్కూప్‌లతో సర్వ్ చేస్తే చల్లచల్లని, తియ్యని ‘చెరుకురసం ఐస్‌క్రీమ్’ రెడీ. మీకు కావాలనుకుంటే దీనిపై కొద్దిగా పుదీనా ఆకులు లేదా డ్రై ఫ్రూట్స్ చల్లుకుని గార్నిష్ చేసుకోవచ్చు. బయట షాపుల్లో దొరికే ఐస్‌క్రీమ్స్ కంటే ఇది చాలా నాచురల్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.
Also Read: డయాబెటిస్ పేషెంట్లకు వరం ఈ జొన్న గుగ్గిళ్లు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!