Ulavacharu Chicken: తెలుగు ప్రజల సంప్రదాయ వంటకాల్లో ఉలవచారుకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామూలుగానే ఉలవచారు యమ టేస్టీగా ఉంటుంది. ఇక అందులో నాటుకోడిని కలిపి వండితే.. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. ప్రోటీన్లు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉలవచారు కోడి కూరను ఈ వీకెండ్‌లో మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఆ కమ్మని రుచిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
నాటుకోడి మాంసం – అర కిలో
ఉలవలు – 100 గ్రాములు
ఉప్పు – రుచికి తగినంత
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
ధనియాల పొడి – టేబుల్ స్పూన్
నెయ్యి – టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్
గరం మసాలా – స్పూన్
కారం – స్పూన్
పసుపు – స్పూన్
ఆవాలు – స్పూన్
కరివేపాకు – రెండు రెబ్బలు
ఎండుమిర్చి – రెండు
చింతపండు – నిమ్మకాయంత సైజులో
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
Also Read: నాన్‌వెజ్‌ను తలదన్నే పుట్టగొడుగుల కూర.. ఈ స్టైల్లో చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
శుభ్రం చేసుకున్న ఉలవలను రాత్రంతా నానబెట్టి, మర్నాడు ఉదయం మెత్తగా ఉడికించాలి. అవి చల్లారాక వడకట్టి, రెండు కప్పుల చిక్కని ఉలవ నీళ్లను రెడీ చేసుకోవాలి. చింతపండును శుభ్రంగా కడిగి వేడినీళ్లలో నానబెట్టి పులుసు తీయాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్‌ను శుభ్రం చేసి, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి కలిపి ఓ పావు గంట మ్యారినేట్ చేయాలి. కుక్కర్లో నూనె వేడి చేసి.. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిలతో తాలింపు వేయాలి. తర్వాత ఉల్లి తరుగు వేసి గోల్డ్ కలర్‌లోకి వచ్చే వరకూ వేయించాలి. దానిలో సగానికి చీల్చిన పచ్చిమిర్చి, కలిపి ఉంచుకున్న కోడిమాంసం వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలన్నీ ముక్కకు పట్టేలా కలపాలి.
ఇప్పుడు ముందే సిద్ధం చేసుకున్న ఉలవ నీళ్లు, చింతపండు పులుసు జతచేయాలి. కుక్కర్ మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి.. మరో 10 నిమిషాల పాటు సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. కూర దగ్గరపడి కమ్మని వాసన వస్తున్నప్పుడు దించేసి, పైన నెయ్యి చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఉలవచారు చికెన్ రెడీ. దీనిని అన్నంతో పాటు జొన్నరొట్టెతో తింటే మన పల్లెటూరి రుచి గుర్తుకు రావడం ఖాయం.
Also Read: రాగి సంగటి, గారెల్లోకి ఆంధ్రా స్టైల్ నాటు కోడి పులుసు.. ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది!