Mutton Keema Balls: మటన్ వంటకాల్లో ఎన్ని రకాలు ఉన్నా.. కీమా ఉండల కూర రుచి ముందు ఏదైనా దిగదుడుపే. పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు చాలా ఓపిగ్గా కీమాను దంచి, మసాలాలు కలిపి చేసే ఈ వంటకం పేరు చెబితేనే నోరూరిపోతుంది. సాధారణ మటన్ కూర తిని బోర్ కొట్టినప్పుడు.. ముక్కలు నమలడం ఇష్టం లేని పిల్లలకు లేదా పెద్దలకు ఇలా కీమా ఉండలు చేసి పెడితే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. ముద్ద ముద్దకి మసాలాల ఘుమఘుమలు తగులుతూ.. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
అర కిలో మెత్తటి మటన్ కీమా, రెండు పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గసగసాల పొడి, కొబ్బరి తురుము, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా శనగపిండి లేదా పుట్నాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత నూనె సిద్ధం చేసి పెట్టుకోవాలి.
Also Read: వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే మెంతికూర పప్పు.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!
మటన్ కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కీమాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, వేయించిన గసగసాల పొడి, కొబ్బరి తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ మెత్తగా కాకుండా ఉండలు చుట్టడానికి వీలుగా ఉండాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి బైండింగ్ కోసం కొద్దిగా పుట్నాల పొడి లేదా శనగపిండి కలిపి చిన్న చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చుట్టి ప్లేటులో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి.
అలాగే నీళ్లు మరుగుతున్నప్పుడు ముందే సిద్ధం చేసుకున్న కీమా ఉండలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. గరిటెతో వెంటనే తిప్పకుండా ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే ఉండలు విడిపోకుండా గట్టిపడతాయి. ఆ తర్వాత గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి, చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని దించుకుంటే అద్భుతమైన మటన్ కీమా ఉండల కూర రెడీ. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్.
Also Read: 10 నిమిషాల్లో టేస్టీ ఆలూ జీరా వేపుడు.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!