Menthi Kura Pappu: మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు. అందులోనూ మెంతికూర చేసే మేలు అంతా ఇంతా కాదు. సాధారణంగా మెంతికూర కొంచెం చేదుగా ఉంటుందని కొందరు తినడానికి ఇష్టపడరు, కానీ పప్పుతో కలిపి వండితే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఈ మెంతికూర పప్పు, పక్కన ఏదైనా ఆవకాయ లేదంటే వడియాలు ఉంటే ఆ రోజు భోజనం తృప్తిగా సాగిపోతుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా, అచ్చం అమ్మమ్మ వండినట్టుగా ఉండే ఈ పప్పును ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కందిపప్పు – ఒక కప్పు
మెంతికూర – రెండు పెద్ద కట్టలు (శుభ్రం చేసి తరిగినవి)
టమోటాలు – రెండు (ముక్కలుగా కోసినవి)
పచ్చిమిర్చి – 4 లేదా 5
చింతపండు – చిన్న నిమ్మకాయంత
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
పోపు కోసం – నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు (దంచినవి), ఇంగువ (ఐచ్ఛికం).
Also Read: 10 నిమిషాల్లో టేస్టీ ఆలూ జీరా వేపుడు.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులో తరిగిన మెంతికూర, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి, తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తితో పప్పును మెత్తగా ఎనపాలి.
తర్వాత అసలైన రుచిని ఇచ్చే తాలింపు కోసం ఒక చిన్న బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి కాస్త ఎర్రగా వేగితే పప్పుకు మంచి సువాసన వస్తుంది. చివరగా కొంచెం ఇంగువ వేసి, ఈ పోపును తీసుకెళ్లి పప్పులో కలిపేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు తయారైనట్టు. దీనిని అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా తినొచ్చు.
మెంతికూర పప్పు రుచికే కాదు.. పోషకాల గని కూడా. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని పోగొడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి మధుమేహ బాధితులకు ఇది మేలైన ఆహారం. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని విటమిన్లు, ప్రోటీన్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో దోహదపడతాయి.
Also Read: వేసవి సెలవుల్లో పిల్లల కోసం స్పెషల్ మిల్క్ షేక్స్.. రెండు నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు!