Karmakhya Review: అదిరే అభి..జబర్దస్త్ స్టేజ్ పై నవ్వుల వర్షం కురిపించిన ఈ క్రేజీ కమెడియన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు అన్నగానే మరో కామెడీ ఎంటర్ టైనర్ పక్కా అనుకున్నారంతా.కానీ నా రూటే సెపరేట్ అంటూ హర్రర్ జానర్ లో’ కర్మాఖ్య’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.మరి గతేడాది చిరంజీవ సినిమా తో పర్లేదనిపించుకున్న అభి ఈ సినిమాతో అనుకున్న ఫలితం రాబట్టాడా లేదా చూద్దాం.
కథ
కథ విషయానికి వస్తే అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయం చుట్టూ వినిపించే తంత్ర విద్యలు, చేతబడులు, నరబలుల కథలతో మొదలవుతుంది. అక్కడి నుంచి కథ వైజాగ్‌కు షిఫ్ట్ అవుతుంది. హాస్టల్‌లో కలిసి ఉండే కామాఖ్య, ప్రవల్లిక అనే ఇద్దరు అమ్మాయిలు మంచి స్నేహితులు. ఒకరోజు ఫ్రెండ్‌కు బదులుగా ఇన్సూరెన్స్ పనిమీద నగరానికి దూరంగా ఉన్న ఓ పాత ఇంటికి వెళ్లిన కామాఖ్య జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఆమెను బంధించి దేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అసలు వాళ్లు ఎవరు? ఎందుకు కామాఖ్యనే టార్గెట్ చేశారు? ఈ కేసులో పోలీస్ ఆఫీసర్ తిరుపతి పాత్ర ఎలా ఎంటర్ అయింది? చివరకు ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటపడిందా లేదా? అన్నదే సినిమా.
ఎవరెలా చేశారంటే ..
హీరోయిన్ సమైరాకి ఇదే ఫస్ట్ సినిమా.అయినప్పటికీ ఎక్కడా ఆ లోటు కనిపించకుండా సినిమా అంతటా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా భయంతో పరుగులు తీసే సీన్లు, ప్రాణాల కోసం పోరాడే క్షణాల్లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి.కానీ సినిమా మొత్తానికి అభిరామి ఒక సర్ ప్రైజ్ ఫ్యాకేజ్ అనే చెప్పాలి.బయటికి ఎంతో సైలెంట్ గా,ప్రశాంతంగా కనిపించినా,ఆమెలోని క్రూరత్వాన్ని తెరపై చూపెట్టిన తీరుని మెచ్చుకొని తీరాలి.ఆ సీన్స్ నిజంగా ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేవే.
సీనియర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని స్క్రీన్‌పై కొద్దిసేపే కనిపించినప్పటికీ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రతో మంచి ఇంపాక్ట్ చూపించాడు.ఇక శరణ్య ప్రదీప్, మధునందన్, ఆనంద్ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారనే చెప్పాలి.
సినిమా ఎలా ఉందంటే
సినిమా విషయానికి వస్తే మొదటి భాగంలో మాత్రం కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. కొన్ని పాటలు, కామెడీ సీన్స్ వేగానికి బ్రేక్ వేసిన ఫీలింగ్ ఇస్తాయి. కానీ హీరోయిన్ ఆ ఇంట్లో చిక్కుకున్న తర్వాత సినిమా ఇంకో గేర్ వేసుకుని దూసుకుపోతుంది .ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ వరకూ వచ్చే సీన్స్ సినిమాలో ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే రివీలింగ్స్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేవే.ఇక సినిమా చివర్లో పార్ట్-2కు ఇచ్చిన లీడ్ చూస్తే కథను ఇంకా పెద్ద రేంజ్‌లో కొనసాగించే ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతుంది.
ఈ సినిమాకు మరో పెద్ద బలం గ్యాని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సైలెంట్‌గా నడిచే సీన్లలో కూడా బీజీఎం టెన్షన్‌ను పెంచేస్తుంది. కెమెరా వర్క్, లైటింగ్, పాత ఇంటి సెటప్, డార్క్ విజువల్స్ అన్నీ కలిసి థ్రిల్లర్ ఫీల్‌ను బాగా తీసుకొచ్చాయి. ముఖ్యంగా తంత్ర విద్యలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది.
అయితే అన్నింటి కన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అదిరే అభి గురించి.గతేడాది రాజ్ తరుణ్ తో చిరంజీవ అనే ott ఫిలిం తీసిన అభి ఈ సారైనా కామెడీ సినిమా చేస్తాడు అనుకున్నారు.కానీ డిఫరెంట్ గా ఇలా డార్క్ థ్రిల్లర్ జానర్ ఎంచుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.
చివరిగా
మొత్తంగా ఈ మధ్య వరుసగా వస్తున్న రొమాంటిక్ సినిమాలు, కామెడీ ఎంటర్‌టైనర్లకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ఇది. చేతబడులు, మూఢనమ్మకాలు, మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిస్‌గా అనిపించే అవకాశం ఉంది. మొదటి భాగంలో కొంచెం ఓపిక పడితే, రెండో భాగంలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ కి పైసా వసూల్.ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ అభిమానులు ఒకసారి ఎంచక్కా ట్రై చేయవచ్చు.
Karmakhya Movie Review and Rating : 2.5/5