Premane Oorilo Review:కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి టాక్ తెచ్చుకున్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. పల్లెటూరి నేపథ్యాన్ని తీసుకుని ప్రేమ, కుటుంబ బంధాలు, తండ్రి కొడుకుల అనుబంధం వంటి ఎమోషన్స్ ని కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ఈ మధ్యకాలంలో యాక్షన్, క్రైమ్, కమర్షియల్ సినిమాలు దూసుకొస్తున్న సంగతి తెల్సిందే.అలాంటిది ఎలాంటి హడావుడి లేకుండా ఓ స్వచ్ఛమైన ప్రేమకథ రావడం మెచ్చుకోతగ్గ విషయమే,మరి మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అసలు కథేంటి? చూసేద్దాం.
కథేంటి?
భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కొడుకు సంతోష్ (శ్రీరామ్)ను ఎంతో ప్రేమగా పెంచుతాడు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరిలోనే జీవిస్తుంటాడు. అతని మరదలు వసంత (రమిక శివు) సంతోష్‌ను ప్రేమిస్తుంది. అయితే నాగన్న మాత్రం తన కొడుక్కి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయాలని అనుకుంటాడు.
ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ) సంతోష్‌కు పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఆమెపై సంతోష్ మనసు పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రి మాట, కుటుంబ పరువు కోసం సంతోష్ ఓ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చివరికి అతని ప్రేమ ఏమైంది? తండ్రి కోరికను నెరవేర్చాడా? అనేదే సినిమా.
సినిమా ఎలా ఉంది?
‘ప్రేమనే ఊరిలో’ కథలో కొత్తదనం కంటే దాన్ని చెప్పిన విధానమే ప్రధాన బలం. పల్లెటూరి నేపథ్యంతో ఓ ప్రేమకథను చాలా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. కథలో ఎక్కడా భారీ యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఎలివేషన్లు, అనవసరమైన హంగామా కనిపించదు.
ఫస్ట్ హాఫ్‌లో సినిమా కాస్త లైట్‌గా సాగుతుంది. కాలేజ్ నేపథ్యంలో వచ్చే సరదా సన్నివేశాలు, సంతోష్-రుక్మిణి మధ్య క్యూట్ మూమెంట్స్, వసంత వన్‌సైడ్ లవ్ ట్రాక్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
ఇంటర్వెల్ సమయానికి కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. అప్పటి వరకు సరదాగా సాగిన కథ కాస్త సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. ముఖ్యంగా తండ్రి కోసం సంతోష్ తీసుకునే నిర్ణయం సెకండాఫ్‌కు కీలకంగా మారుతుంది.
సెకండాఫ్‌లో కుటుంబ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తండ్రి-కొడుకుల మధ్య సన్నివేశాలు సినిమాకు బలంగా నిలుస్తాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమకథలో ఇప్పటికే ప్రేక్షకుడికి అర్థమైన విషయాలను మరికొంత సమయం తీసుకుని చూపించడం వల్ల కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ ఇస్తాయి.అయితే చివరి అరగంటలో సినిమా పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కథకు మంచి ముగింపును ఇస్తాయి.
నటీనటుల పనితీరు
నాగన్న పాత్రలో రంగాయన రఘు చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. సంతోష్‌గా శ్రీరామ్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. అమాయకమైన పల్లెటూరి యువకుడిగా, ప్రేమలో పడిన వ్యక్తిగా, చివరికి కుటుంబం కోసం కఠినమైన నిర్ణయం తీసుకునే కొడుకుగా తన పాత్రలో మార్పులను బాగానే చూపించాడు.రమిక శివు వసంత పాత్రలో సహజంగా కనిపించింది. తపస్విని పూనాచ రుక్మిణి పాత్రకు అవసరమైన సున్నితత్వాన్ని తీసుకొచ్చింది.
టెక్నికల్‌గా..
సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో పల్లెటూరి విజువల్స్ ఒకటి. గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించిన సినిమాటోగ్రఫీ కథకు మంచి ఫీల్ తీసుకొచ్చింది.సునద్ గౌతమ్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం అక్కడక్కడా లిప్ సింక్ సమస్య కనిపిస్తుంది. ఇది పెద్ద మైనస్ కాకపోయినా కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది.
చివరిగా..
‘ప్రేమనే ఊరిలో’ భారీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ కోసం ఎదురుచూసే ప్రేక్షకుల కంటే.. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన క్లీన్ ఎంటర్‌టైనర్‌ను ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది.
కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం, డబ్బింగ్‌లో చిన్నచిన్న లోపాలు మైనస్‌గా అనిపించినా.. చివరి అరగంటలో వచ్చే ఎమోషనల్ డ్రామా వాటిని కొంతవరకు కవర్ చేస్తుంది. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా చూసే ప్రేమకథ కావాలనుకునే వారికి ఈ సినిమా ఒక ఆప్షన్‌గా నిలుస్తుంది
Premane Oorilo Review & Rating : 2.75/5
ALSO READ:తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?