Swedish Crime Thriller Series: స్టాక్‌హోమ్‌లో వరుసగా పోలీసు అధికారులు హత్యకు గురవుతుంటే.. ఈ కేసును ఛేదించాల్సిన డిటెక్టివ్ కు ఊహించని వ్యక్తి సహాయం అవసరమవుతుంది. కానీ అతడు సహాయం అడగాల్సింది తనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తి దగ్గర. తన తండ్రితో ఏళ్లుగా దూరంగా ఉన్న పోలీసు అధికారి… ఇప్పుడు అదే తండ్రితో కలిసి ప్రమాదకరమైన హంతకుడి కోసం వేట మొదలుపెడతాడు. ఇదే ‘బ్లడ్ సాక్రిఫైస్’ (Blood Sacrifice) మూవీ స్టోరీ. మరి అసలు ఆ నరబలి వెనకున్న కథ ఏంటి ? సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్నది తెలుసుకుందాం పదండి.
స్టాక్ హోమ్ లో ఓ మహిళ తనను కత్తితో ఎవరో దాడి చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేస్తుంది. అయితే ఆ కాల్ మధ్యలోనే కట్ అవుతుంది. పోలీసులు కాల్ వచ్చిన ప్రదేశాన్ని ట్రేస్ చేయగా అది ఓ ఖాళీగా ఉన్న వెకేషన్ హౌస్ అని తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులు మాత్రం దారుణంగా హత్యకు గురై కనిపిస్తారు. దాడి చేసిన వ్యక్తి ఎవరో, ఆ మహిళ ఎక్కడుందో ఎలాంటి ఆధారం దొరకదు.
ఇది ఒక్క హత్యతో ఆగిపోదు. కొద్ది రోజుల్లోనే మరో పోలీసు అధికారి హత్యకు గురవుతాడు. వరుసగా పోలీసులు టార్గెట్ అవుతుండటంతో కేసు మరింత సీరియస్ గా మారుతుంది. ఈ దర్యాప్తు బాధ్యత డిటెక్టివ్ థామస్ బెర్గ్ పై పడుతుంది. కానీ కేసు ముందుకు వెళ్లాలంటే అతడికి గతంలో పోలీస్ విభాగంలో పని చేసిన తన తండ్రి ఆల్ఫ్రెడ్ సహాయం అవసరం అవుతుంది. థామస్ కు తండ్రికి కొన్ని విభేధాల కారణంగా దూరంగా ఉంటాడు. ఆల్ఫ్రెడ్ కూడా గతంలో పోలీస్ విభాగం నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడం థామస్ కు ఇష్టం ఉండదు.
కానీ హంతకుడు ఎవరు, ఎందుకు పోలీసులనే లక్ష్యంగా చేసుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఇద్దరూ కలిసి పని చేయక తప్పదు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కేసులో కొత్త ఆధారాలు బయటపడతాయి. ఓవైపు హంతకుడి ఆచూకీ కోసం తండ్రీకొడుకులు ప్రయత్నిస్తుంటే… మరోవైపు వారి మధ్య ఉన్న పాత విభేదాలు కూడా బయట పడుతుంటాయి. థామస్ తన విధి, వ్యక్తిగత జీవితానికి మధ్య ఇరుక్కుంటాడు. ఆల్ఫ్రెడ్ మాత్రం తనదైన పద్ధతిలో కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇద్దరూ కలిసి హంతకుడి వద్దకు చేరుకుంటారా ? పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? అడవిలో దొరికే ఓ భయంకరమైన ఆధారం ఈ కేసును ఎలాంటి మలుపు తిప్పుతుంది ? హంతకుడు మరో పోలీసును చంపకముందే థామస్, ఆల్ఫ్రెడ్ అతడిని పట్టుకోగలరా ? అనేదే సిరీస్‌లో చూడాల్సిన ఉత్కంఠభరితమైన కథ.
జాకబ్ ఆఫ్టెబ్రో, పీటర్ ఆండర్సన్, ఎలక్ట్రా హాల్‌మన్ తదితరులు నటించిన ఈ స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ సాక్రిఫైస్’. దీనికి జార్జ్ కే క్రియేటర్. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఐదు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సిరీస్. స్వీడిష్ తో పాటు ఇంగ్లీష్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది. ఒకవేళ సిరీస్ ను చూడాలనుకుంటే ఇంగ్షీషులో చూడవచ్చు.