Tribanadhari Barbarik Review : ‘రాజాసాబ్’ దర్శకుడు మారుతీ సమర్పణలో సత్య రాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఉదయభాను ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడం సినిమాకి మొదటి నుండి ప్రత్యేక ఆకర్షణ చేకూర్చింది. మరి కథ, కథనాలు ఆ రేంజ్లో మెప్పించాయో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ:
చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో మనవరాలికి తానే అమ్మ, నాన్న అవుతాడు సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్). ఆమె పేరు నిధి (మేఘన). అయితే ఊహించని విధంగా ఆమె ఒక రోజు మిస్ అవుతుంది. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. తాను కూడా మరో పోలీస్(సత్యం రాజేష్) తో కలిసి గాలిస్తుంటాడు. ఈ క్రమంలో ముందు వెనుక ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో రామ్ (వశిష్ట ఎన్ సింహా), దేవ్ (క్రాంతి కిరణ్) పాత్రలు కూడా పరిచయం చేస్తుంటారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కష్టపడి పని చేసి వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్లాలని రామ్ అనుకుంటాడు.కానీ అనుకున్న టైంకి డబ్బులు దొరక్కపోవడంతో అతను క్రైం చేసి సంపాదించాలని డిసైడ్ అవుతాడు. అతని ఫ్రెండ్ దేవ్ కూడా ఈ క్రైమ్స్ లో పార్ట్నర్ అవుతాడు. వీళ్ళకి నిధి మిస్సింగ్ కి సంబంధం ఏంటి? మధ్యలో వాకిలి పద్మ (ఉదయభాను) దాసన్న (మొట్ట రాజేంద్రన్) ..ల పాత్రలు ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
మహా భారతంలో బార్బరీకుడు పాత్ర గురించి ఎక్కువ మంది మాట్లాడుకోరు. అతని 3 భాణాలకి ఉన్న ప్రత్యేకత కూడా చాలా మందికి తెలీదు. అయితే మన కథలో బార్బరీకుడు సత్యరాజ్. తన మనవరాలు కనిపించకుండా పోవడానికి? అందుకు కారణమైన వారికి బుద్ధిచెప్పేందుకు అతను ఏం చేశాడు? అనే దానికి కథని లింక్ చేసిన విధానం బాగుంది.దర్శకుడు మోహన్ ఐడియాకి మెచ్చుకోవచ్చు.
మైథలాజిలో ఒక పాత్రను తీసుకుని దాని చుట్టూ ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా, ముఖ్యంగా మెసేజ్ ఇచ్చే మంచి కథని డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ కథనం మాత్రం వీక్ గా చాలా వరకు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది. దాని విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే కచ్చితంగా సినిమా స్థాయి మరో రేంజ్లో ఉండేది.
‘థ్రిల్లర్ సినిమాల్లో కథనం ఇలాగే ఉంటుంది కదా’ అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అలాగే ఉన్న థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ ను ఫోన్లు వైపు చూడనివ్వవు. కానీ ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ కి వచ్చేసరికి రన్ టైం 2 గంటల 8 నిమిషాలే ఉన్నప్పటికీ ‘ఏంటి ఇంకా ఇంటర్వెల్ రాదు’ ‘ఇంకా ఎంత సేపటికి క్లైమాక్స్ వస్తుంది?’ వంటి ప్రశ్నలు సినిమా చూస్తున్నప్పుడు మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి.
అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు అప్పటివరకు ఉన్న ఒపీనియన్ ను మార్చేందుకు ప్రయత్నిస్తాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. నిర్మాత నటీనటుల పారితోషికాలకే ఎక్కువ బడ్జెట్ పెట్టారు అనిపిస్తుంది. అందువల్ల టెక్నికల్ టీం పై భారం పడింది. మ్యూజిక్ బాగుంది. పాటలు చూస్తున్నప్పుడు బాగానే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.
నటీనటుల విషయానికి వస్తే.. సత్యరాజ్ ఎప్పటిలానే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఉదయభానుకి మంచి పాత్ర దొరికింది. కానీ ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండటం గమనార్హం. బహుశా ఎడిటింగ్లో ఆమె పార్ట్ కి సంబంధించిన సన్నివేశాలు కట్ చేసినట్టు ఉన్నారు. వశిష్ఠ సింహా బాగానే చేశాడు కానీ.. ఎందుకో ఇతన్ని విలన్ గా చూసుండటం వల్ల లవర్ బాయ్ గా, యూత్ గా యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపించింది. పాప మేఘన, కార్తికేయ బాగానే చేశారు. వీటీవీ గణేష్ ఈ మధ్య మారుతీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర ఇరికించినట్టే ఉంది. సత్యం రాజేష్ వంటి వాళ్ళు ఓకే.
ప్లస్ పాయింట్స్
కథ
క్లైమాక్స్
టెక్నికల్ టీం వర్క్
మంచి మెసేజ్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
సాగదీత
మొత్తంగా.. ‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి పాయింట్ తో రూపొందిన సినిమా… స్క్రీన్ ప్లే పై ఇంకాస్త శ్రద్ద వహించి ఉంటే.. సినిమా యూనిట్ ఆశించిన ఫలితాన్ని దక్కించుకునేది. ఇప్పటికైతే పర్వాలేదు అనే పదంతోనే సరిపెట్టేసేలా ఉంది
Tribanadhari Barbarik Rating : 2.5/5